Structures | రూ.240 లక్షల నిధులు మంజూరు…

Structures | రూ.240 లక్షల నిధులు మంజూరు…
ఎంపీ విజ్ఙాపనకు స్పందించిన రాష్ర్ట ప్రభుత్వం…
Structures | నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ రహదారుల అభివృద్ధి పై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రమంలోనే సంబంధిత రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పలుమార్లు ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి విజ్ఞాపనలు అందజేశారు. ప్రత్యేకించి నందిగామ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలసి గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన మంత్రి బిసి జనార్ధన రెడ్డిని సచివాలయంలో కలిసారు.
నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రహదారులు, వంతెనల పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శిథిలావస్థలో ఉన్న ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన మార్గాలు, వంతెనల మరమ్మతుల అవసరాన్ని వివరించారు. ప్రజలకు సులభ రవాణా సౌకర్యం అందించాలంటే తక్షణమే రహదారుల నిర్మాణాలు, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రోడ్లు కీలకమని, త్వరితగతిన పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అప్పట్లో మంత్రిని సచివాలయంలో నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి వెళ్లి విజ్ఞాపన అందజేశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారంతో తాజాగా నందిగామ నియోజక వర్గంలో పలు అభివృద్ధికి ఆర్, బి శాఖ నుంచి రూ.240 లక్షల నిధులను మంత్రి జనార్దన్ రెడ్డి మంజూరు చేస్తూ ప్రభుత్వపరంగా జీవో జారీ చేశారు. దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు ఆర్ & బి శాఖ ద్వారా మంజూరు చేసినట్లు ఎంపీ కేసినేని శివనాద్ ( చిన్ని) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.డి.ఆర్,ఎస్.హెచ్ అప్గ్రేడేషన్ల కింద, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల మెరుగుదలకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
Structures | మంజూరైన పనుల వివరాలు..
నందిగామ నియోజకవర్గంలో రూ.210.00 లక్షల నిధులతో ఎన్హెచ్ 65 నుండి కంచికచర్ల – ఎస్. అమరావరం రోడ్ (కిమీ 0.0 నుండి 5.3 వరకు) రూ.30.00 లక్షల నిధులతో ఎన్హెచ్ 65 నుండి కంచెల రోడ్ (కిమీ 0/0 నుండి 6/8 వరకు) మొత్తం పొడవు: 6.800 కిమీ. మొత్తంగా రూ.240 లక్షల నిధులు నందిగామ నియోజకవర్గానికి కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.
Structures | ప్రత్యేక ధన్యవాదాలు..
నందిగామ అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంబంధిత రాష్ట్ర మంత్రి బి. సి.జనార్దన్ రెడ్డి కు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివ నాథ్ ( చిన్ని) ధన్యవాదాలు తెలిపారు. తన కృషితో పాటుగా స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య సహకారంతో మంత్రి జనార్దన్ రెడ్డి ను పలుమార్లు కలవడంతో నిధులు మంజూరు జరిగినట్లు వివరించారు.
Structures | నిధుల కేటాయింపుతో రహదారుల సత్వర అభివృద్ధి..
రహదారుల అభివృద్ధికి ప్రభుత్వపరంగా నిధులు కేటాయింపుల ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు సమకూరనున్నాయి. వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు రహదారుల నిర్మాణంతో పురోగతి సాధ్యపడుతుంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
