నో హెల్మెట్ – నో ఫ్యూల్ నిబంధనను అమలు చేయాలి

నో హెల్మెట్ – నో ఫ్యూల్ నిబంధనను అమలు చేయాలి
బాపట్ల ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణ కోసం ‘నో హెల్మెట్ – నో ఫ్యూల్’ (హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు) విధానాన్ని అమలు చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ప్రజల భద్రతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న నో హెల్మెట్ – నో ఫ్యూల్ నిబంధనను ఏపీలో కూడా ప్రవేశపెట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ఉన్న వారికి మాత్రమే ఇంధనం ఇచ్చే నిబంధన వల్ల వాహనదారుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, ఇది వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజనరీ నాయకత్వంలో ఈ చట్టం కార్యరూపం దాల్చి, సురక్షిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బాపట్ల ప్రజలు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అభ్యర్థనకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ పార్టీ ర్యాలీలలో కూడా నాయకులు కార్యకర్తలు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొనాలని, వాటికి శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
