సింగిల్ బ్రిడ్జి తో…సకల ఇబ్బందులు

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని మోత్కూర్-గుండాల ప్రధాన రూట్లో బిక్కేరు వాగు పై సుమారు 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ సింగిల్ లైన్ బ్రిడ్జి తో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు, ఆర్టీసీ, ప్రయివేటు వాహనాల డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాటి రోజుల్లో సింగిల్ బ్రిడ్జి తో తొలగిన ఇబ్బందులు కాస్త.. పెరుగుతున్న జనాభా..మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల వాహనాల రద్దీ రోజురోజుకు తీవ్రం కావడంతో ఈ సింగిల్ బ్రిడ్జి పై ప్రయాణం …నల్లేరు పై నడకలా మారింది.

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామెల్ లు సాక్షాత్తు అసెంబ్లీలో గగ్గోలు పెట్టినా సదరు ఉన్నతాధికారులకు,సంబంధిత మంత్రులకు కనికరం లేకుండా పోయింది. గత 3 నెలల క్రితం స్వయంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి ఈ రోడ్డు వెంట గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి వెళ్ళినప్పుడు సైతం మోత్కూర్ బ్రిడ్జి ని డబల్ లైన్ బ్రిడ్జి గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపమని ఆదేశించినా..అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది.నిత్యం ఈ బ్రిడ్జి పై ట్రాక్టర్ లు,ఆర్టీసీ బస్సులు,ప్రయివేటు వాహనాలు ,పత్తి లోడ్ డి సి ఎం లు,భారీ వాహనాలు ఒక వైపు వస్తుంటే…మరో వైపు ఆ వాహనాలు చూసి అక్కడే నిలిసిపోవాల్సి వస్తుంది.

దీంతో ప్రయాణికులకు సమయాభావంతో పాటు నిత్యం ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. చీకట్లో సైకిల్ పై బావుల వద్దకు వెళ్లే వ్యక్తులకు బ్రిడ్జి కి రక్షణ గోడ లేకపోవడంతో పలుమార్లు వాహన ప్రయాణికులు బ్రిడ్జి పై నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు సైతం ఉన్నాయి.నల్గొండ నుంచి వరంగల్ జిల్లా కి వెళ్లాలంటే మోత్కూర్ మీదుగా దూరం సైతం తక్కువ ఉండడంతో ఈ రహదారి వెంట ఎంతోమంది ప్రయాణికులు జనగామ, వరంగల్ కి వెళ్తుంటారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో డబల్ లైన్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ,ప్రయాణికులు విన్నవిస్తున్నారు.

Leave a Reply