Nandikotkur | శుభకార్యక్రమం రోజునే..

Nandikotkur | శుభకార్యక్రమం రోజునే..
Nandikotkur | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలో చిన్నకోట స్కూల్ సమీపంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త శుభ కార్యక్రమం రోజునే నందికొట్కూరులో గురువారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మద్ది గట్ల రోడ్డులో చిన్నకోట స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న కళ్యాణి (28)పై ఆమె భర్త మల్లి కార్జున మద్యం మత్తులో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు.
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల ప్రాంతానికి చెందిన కళ్యాణి, నందికొట్కూరుకు చెందిన మల్లి కార్జునతో సుమారు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అత్త పెద్ద కూతురు కుటుంబంలో లగ్నపత్రిక శుభ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజునే ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గురువారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన మళ్లీ కార్జున భార్యతో గొడవ పడి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

బాధితురాలి కేకలు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్ర గాయాలపాలైన కళ్యాణిని అంబులెన్స్ ద్వారా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

