8thFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
8thFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
8thFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
1. మహాశివరాత్రికి అలౌకికంగా మేల్కొంటున్న తిమ్మమ్మ మర్రిమాను
2. కబుర్లు(శీర్షిక)
3. సన్నిహితం(శీర్షిక)
4. మెదడుకు మేత-సామెత(శీర్షిక)
5. సుబాణీయం(శీర్షిక)
6.ఆలోచనా’శ్రీ’నివాసం(శీర్షిక)
7. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)
-____________________-____________________-____________________

1 ముఖపత్ర కథనం
8thFeb2026 | మహాశివరాత్రికి అలౌకికంగా మేల్కొంటున్న తిమ్మమ్మ మర్రిమాను
8thFeb2026 | ఊడల మధ్య కాలం నడిచే అద్భుతమైన మహావృక్షం
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అతిపెద్ద వటవృక్షం
తిమ్మమ్మ కథ – విశ్వాసం, పురాణాల సంగమం
కెమెరా చూపుతో ప్రపంచానికి పరిచయమైన మహిమ
మహాశివరాత్రి వేళ భక్తి ఉప్పెనగా మారే ప్రదేశం
రథోత్సవం, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వైభవం
టూరిజం హబ్‌గా మారే అవకాశాలు – అభివృద్ధి అవసరం

ఊడల మధ్య కాలం నడిచే అద్భుతమైన ప్రదేశం…
మహాశివరాత్రి కోసం అలౌకికంగా మేల్కొంటున్న తిమ్మమ్మ మర్రిమాను
ప్రకృతి అరణ్యం… పురాణ గాథ…
భక్తి తరంగం — హృదయాన్ని కదిలించే ఒక జీవించే కథ
ఆంధ్రప్రభ శ్రీ సత్య సాయి బ్యూరో : సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే ఆ ప్రాంతం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మెల్లగా మేల్కొంటుంది. గాలి తాకిన ఆకులు మర్మర స్వరాలతో చప్పుళ్లు చేస్తాయి. పక్షుల మధుర స్వరాలు ఆకాశంలో ఉప్పొంగిపోతాయి. నేలపై పడిన నీడలు ఒక విశాలమైన, భయభక్తులను కలిగించే అరణ్యాన్ని గుర్తు చేస్తాయి.
కానీ అది అడవి కాదు —
అది ఒకే ఒక్క చెట్టు.
అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహావృక్షం.
తిమ్మమ్మ మర్రిమాను.
ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షంగా నిలిచిన ఈ అద్భుత జీవి… ప్రకృతి తన చేతులతో నిర్మించిన దైవిక ఆలయం లాంటిది. మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఈ మహావృక్షం మరోసారి భక్తి ఉప్పెనగా మారేందుకు సిద్ధమవుతోంది.
మొదటి అడుగు — మరో ప్రపంచం…

తిమ్మమ్మ మర్రిమాను వైపు వెళ్లే మార్గం మొదట సాధారణంగానే కనిపిస్తుంది.
కానీ చెట్టు దగ్గరకు చేరుకున్న క్షణంలోనే దృశ్యం ఊహించని రీతిలో మారిపోతుంది.
ఎటు చూసినా అంతులేని ఊడలు… నేలను తాకి కొత్త జీవితం మొదలుపెట్టిన వేర్లు… పైకి చూస్తే ఆకుల అనంత సముద్రం.
అది ఒక్క చెట్టు అనిపించదు.
అది ఒక స్వంత లోకం.
అది ఒక కాలాతీత అనుభవం.
ఒక్క అడుగు ముందుకు వేస్తే మరో చెట్టు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అది కూడా అదే చెట్టు భాగమే అని తెలిసినప్పుడు మనసులో ఆశ్చర్యం, భయం, భక్తి కలిసి ఉప్పొంగుతాయి. కాలం ఇక్కడ నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.
కెమెరా చూపు — ప్రపంచానికి పరిచయం…
1989లో బెంగుళూరుకు చెందిన సత్యనారాయణ అయ్యర్ తన కెమెరా కళ్లతో ఈ చెట్టును ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటివరకు నిశ్శబ్దంగా, నిర్లక్ష్యానికి గురైన ఈ మహావృక్షం, ఒక్కసారిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

తరువాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ప్రపంచ పర్యాటక మ్యాప్‌పై గర్వంగా నిలిచింది.
ల్యాండ్‌మార్క్ ట్రీస్ ఆఫ్ ఇండియా సర్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షాల్లో అగ్రస్థానంలో నిలవడం ఈ చెట్టు అసాధారణ గొప్పతనానికి మరింత ముద్ర వేసింది.
ఊడల కథ — కాలం చెప్పే పురాణం
ఈ చెట్టు కింద నడుస్తుంటే ప్రతి ఊడ ఒక వేదనతో నిండిన, విశ్వాసాన్ని రగిలించే కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం తిమ్మమ్మ అనే మహిళ సతీ సహగమనం చేసిన ప్రదేశంలో ఈ చెట్టు పెరిగిందని చెబుతారు.
కాలం గడిచేకొద్దీ ఆమె కథ చెట్టు ఊడలతో కలిసి అమరత్వం పొందింది.
విష్ణువు బెరడుగా, బ్రహ్మ వేర్లుగా, శివుడు కొమ్మగా నివసిస్తున్నారని త్రిమూర్తి భావనతో ఈ చెట్టును పూజిస్తారు.
సంతానం కోసం ఎదురుచూస్తున్న జంటలు ఇక్కడికి వచ్చి ప్రార్థించడం ఇప్పటికీ అచంచల సంప్రదాయంగా కొనసాగుతోంది.
మహాశివరాత్రి — క్షణాలు మారే సమయం…

మహాశివరాత్రి దగ్గరపడే కొద్దీ తిమ్మమ్మ మర్రిమాను వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం ఒక్కసారిగా భక్తుల ప్రవాహంతో నిండిపోతుంది.
పూజల కోసం సిద్ధమవుతున్న పూజారులు…
అలంకరణలో నిమగ్నమైన యువకులు…
దీపాల వెలుగులో మెరిసే ఊడలు…
అన్నీ కలిసి ఒక ప్రాణం ఉన్న ఆధ్యాత్మిక చిత్రంలా కనిపిస్తాయి.
మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న జరగనున్న తిమ్మమ్మ రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంప్రదాయ వాద్యాల మోగుడుతో రథం నెమ్మదిగా కదులుతుంటే — భక్తి ఒక ఊపిరిలా వ్యాపిస్తుంది.
అభివృద్ధి — ఆశలు, అవసరాలు

1992లో అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చిన ఈ ప్రదేశం కొంతవరకు అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇంకా తగిన స్థాయి అభివృద్ధి లేకపోవడం పట్ల స్థానికుల్లో అసంతృప్తి ఉంది.
టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తే పుట్టపర్తి నుంచి హార్సిలీ హిల్స్ వరకు ఒక శక్తివంతమైన పర్యాటక మార్గం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎకో పార్క్, ట్రెక్కింగ్ మార్గాలు, రిసార్ట్‌లు ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా మారే అవకాశముంది.
మహావృక్షం పిలుపు…
ప్రతి ఊడ ఒక చరిత్ర…
ప్రతి నీడ ఒక ఆశ్రయం…
ప్రతి గాలి తాకుడు ఒక అలౌకిక అనుభూతి.
తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి వేళ భక్తులను మరోసారి తన విశాల నీడలోకి ఆహ్వానిస్తోంది.
ఈ నెల 15న జరిగే తిమ్మమ్మ రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.


కే ప్రసాద్,
బ్యూరో ఇంచార్జ్,
ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి జిల్లా
————————————————————————————————–
2 కబుర్లు (శీర్షిక)

అనుచిత ఉచిత పథకాలు
మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి ప్రజల్ని ఆకర్షించే విధంగా ఎన్నో ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. గ్యాస్, గ్రైండర్, మిక్సీ, సైకిల్ లాంటివి ఇవ్వటమే కాకుండా, ఉచితంగా ఇళ్ళు కూడా కట్టి ఇస్తున్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. రైతులకు ఇంతకు ముందున్న రుణాలు మాఫీ చేయడమే కాకుండా, వారికి భూములతో పాటు, తిరిగి ఇవ్వనవసరం లేని రుణాలు ఇస్తున్నారు. మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి, మహిళలకి, భర్త చనిపోయిన వారికి, భర్త వదిలి పెట్టిన వాళ్లకి, అంగవైకల్యం కలిగినవారికి, వేలకొద్ది రూపాయలు నెల నెల వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు. వృద్ధులకు పింఛన్ పథకం కింద నెల నెల డబ్బులు ఇస్తున్నారు.
ఇవన్నీ వినటానికి చాలా మంచి పథకాల కింద కనిపించినా, ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది నిజం చెప్పాలంటే. అవసరం లేని ఉచిత పథకాల పుణ్యమా అని ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది.
సరే అన్నీ ఉచితంగా ఇస్తే ప్రజలు ఇంకేం చేస్తారు? సుఖం అన్నమాట మరిగిన వాడు కష్టడటానికి ఇష్టపడడు. ఏ ఒక్కడూ వళ్ళొంచి పనిచేయటానికి సిద్ధపడడు. ఇళ్లల్లో కూర్చుని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన టీవీ చూసుకుంటూ, మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తారు. కొందరైతే డబ్బు ఎక్కువై మితి మీరి మద్యం తాగుతో రోగాల బారిన పడతారు. అసాంఘిక శక్తులుగా మారతారు. సామాజిక శాస్త్ర పరిశోధనల తాజా గణాంకాల ప్రకారం ముప్పయి శాతం మంది సోమరిపోతులుగా తయారవుతున్నారు. ప్రభుత్వాలే ఉచిత పథకాల పేరుతో ప్రజలని తప్పు దారికి మళ్ళిస్తున్నాయి.
ఉచిత పథకాలను నమ్ముకున్న రాష్ట్రాలకు పుట్టగతులు ఉండవు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ దేశం పేరు గుర్తులేదు గాని దానిని పరిపాలించిన రాజు దగ్గర చాలా ధనం ఉండేది. అతను తన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో, అన్నీ ఉచితంగా ఇవ్వటం మొదలెట్టాడు. దాంతో, ఎవరూ పనిలోకి వెళ్ళటంగాని, చదువుకోవటంకానీ చేసేవారు కాదు. ఎంతసేపూ ఇంట్లో కూర్చుని మద్యం సేవించడం, ఊరి మీద పడి తిరగటంగా ఉండేది పరిస్థితి.కొద్ది కాలంలోనే రాజుగారి ఖజానా ఖాళీ అయ్యింది. అయినా కూడా ప్రజల కష్ట పడకూడదని ఇతర దేశాల నుంచి అప్పులు చేసి మరీ , వారికి యధాతధంగా ఉచిత సౌకర్యాలు కల్పించేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత, ఏ దేశమూ ఆ రాజుకి అప్పు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఏమీ చేయలేక ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం మొదలెట్టాడు. తమ దగ్గర రాజు గారు ఇచ్చిన డబ్బులు ఉన్నంత వరకు ప్రజలు పన్నులు కట్టారు. ఆ తరువాత ఏం చేయాలో వారికి తెలియలేదు. వారికి చదువు రాదు, ఏ పని తెలియదు. పోనీ ఇతర దేశాల నుంచి మనుషులను రప్పించుకొని అభివృద్ధి చేసుకుందామని రాజు అనుకున్నా, ఏ దేశం నుంచి ఎవరూ రావటానికి సిద్ధపడలేదు. వ్యవసాయం తెలియక భూములు బీడుభూములుగా మారాయి. రాజుగారు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రజలు డబ్బుల్లేక ఒకరినొకరు దోచుకోసాగారు. కొన్ని ఏళ్ళ తర్వాత ఆదేశం కాలగర్భంలో కనుమరుగయిపోయింది. రాజుగారి అనుచిత ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేయడం మాట అలా ఉంది అసలు దేశం మనుగడగే ముప్పు తెచ్చిపెట్టింది.
బడుగు వర్గాలు పైకి రాకూడదు అని కాని, అసహాయులకు అండ ఉండకూడదు అని కాని, వారికి అవసరం అయిన మేరకే ఉచితంగా సౌకర్యాలు కల్పించాలి. అనర్హులకు కూడా తేరగా ఉచిత పథకాలు వర్తింపచేయకుండా జీవన ఉపాధి కల్పిస్తే ఉచితంగా ఉంటుంది. కలకాలం వాళ్ళు సొంతకాళ్ళ మీద గౌరవంగా బతకటానికి ఆస్కారం కల్పించినట్లవుతుంది.
———————————————————————-
3.సన్నిహితం… శీర్షిక

నోరు మంచిదైతే…
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఈ నానుడి మనందరికీ తెలిసినదే కదా.కానీ మనలో చాలా మంది ఇది పాటించం. ఎందుకు మనం నోరు మూసుకుని ఉండాలి అని అనుకుంటాం. మన వ్యక్తిత్వం , ఆత్మాభిమానం అలా మనల్ని నోరు అదుపులో పెట్టుకోకుండా చేస్తుంది.
మనం గమనిస్తే ఏదైనా రంగంలో పైకి వచ్చిన వ్యక్తులు తొలి రోజుల్లో వినయంగా ఉంటూ అందరితో చక్కగా మాట్లాడుతూ మాట మీద కంట్రోల్ తో ఉంటారు.కానీ ఆ రంగంలో ఒక స్టేజ్ కి వచ్చాక తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు.అభాసుపాలవుతారు. లేదా అంతకాలం తమ మనసులో అణిచి పెట్టుకుని ఉన్న ఫీలింగ్స్ ను బయటకు కక్కుతూ ఉంటారు. అది ఎంత ప్రభావం చూపుతుందో అని ఆలోచించరు . సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో ప్రముఖులు నోరు మరింత అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ లూజ్ టంగ్ వల్ల ఎంతో టేలెంట్ ఉన్నప్పటికీ వారికి అవకాశాలు తగ్గుతాయి. ఓకే ఇదంతా సమాజంలో ఒక స్థాయికి వచ్చిన సెలబ్రిటీ ల పరిస్థితి. అయితే మామూలు మనుషులు కూడా ఇలా లూజ్ టంగ్ కలిగి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.
మా ఆఫీసులో పని చేసే ఒక ఎంప్లాయ్ కి సడన్ గా ట్రాన్సఫర్ వచ్చింది.వేరే సిటీకి అందునా ఊరికి దూరంగా ఒక అడవిలాంటి ప్రాంతంలో ఉండే ఆఫీస్ కి ట్రాన్సఫర్ చేశారు.
” నేను ఏం తప్పు చేశాను అని నాకు ఈ పనిష్మెంట్ ” అంటూ నా దగ్గర వాపోయాడు.
అతడు చేసిన తప్పు గుర్తుచేసాను నేను.
ఒకరోజు మీటింగ్ జరుగుతుండగా మా డైరెక్టర్ అతన్ని ఒక విషయం అడిగాడు.అప్పుడు ఈ వ్యక్తి అంత పెద్ద మీటింగ్ లో , అందరి ముందు ” మీకు నేను ఎందుకు చెప్పాలి సార్ ? ” అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. కాసేపు నిశ్శబ్దం అలుముకుంది మీటింగ్ హాల్లో. డైరెక్టర్ ఒక క్షణం షాక్ అయి మళ్ళీ మామూలు అయ్యాడు. మీటింగ్ కంటిన్యూ అయింది. కానీ తన ఇగో మీద పడిన దెబ్బ డైరెక్టర్ మర్చిపోలేదు. ఫలితంగా కొన్నాళ్ళకి ఆ వ్యక్తికి సైలెంట్ గా ట్రాన్సఫర్ అయింది.
ఆ విషయం గుర్తు చేసాక ” అవును సార్..నిజమే.నేను నోరు అదుపులో పెట్టుకోలేదు ఆరోజు ” అని రియలైజ్ అయ్యాడు.
కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ లో మన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకొని నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది.లేకపోతే ఇబ్బందుల్లో పడటం గ్యారంటీ..ఏమంటారు ఫ్రెండ్స్ !!!!
_______________________++++________________
4.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

అందర్నీ మెప్పించడం అయ్యే పని కాదు
అసలు అందర్నీ మెప్పించాలనుకోవటమే అర్థం లేని పని. ప్రతివాడికీ తనదైన ఇగో, అసూయ, కుళ్ళుబోతుతనం ఉంటాయి. మనంతట మనం మంచి పనులు చేసుకుంటూ ఉన్నా కొందరికి నచ్చదు. అలాంటి వాళ్ళను తన ‘భాస్కరశతకం’లో ‘చిమ్మెట’ తో పోల్చారు మారద వెంకయ్యగారు. ఈ పద్యం చూడండి.
ఉ.: ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా!
చీరలు నూరు అంకములు చేసెడి వైనను బెట్టె నుండగా
జేరి, చినింగిపో గొరకు చిమ్మెట కేమి ఫలంబు భాస్కరా!
మెప్పించడం సంగతి అటుంచితే, మెచ్చుకోవడానికి చాలా సంస్కారం కావాలి. పై పద్యంలో ‘నిష్కారణ మోర్వలేక’ అన్న పదబంధం అసూయకు కారణముండదని సూచిస్తుంది. దీనినే ఫ్రాన్సిస్ బేకన్ “ఎన్వీ టేక్స్ నో హాలిడేస్” అన్నాడు. అసూయకు సెలవులుండవట. అంటే, నిరంతరం అది మనిషి మనస్సులో జ్వలిస్తూ ఉంటుంది.
విశ్వనాథ అంతటివారు ఈ చిమ్మెటల నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన కల్పవృక్షమంతా తప్పుల తడకేననే ప్రబుద్ధులు అప్పుడే బయలుదేరారు. దాని మీద పెద్ద వివాదమే నడిచింది. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్: నహి వంధ్యావిజానాతి గుర్వీమ్ ప్రసవ వేదనామ్’ అంటున్నది సుభాషితం. “కేవలం ఒక పండితుడే మరో పండితుని విద్వత్తును తెలుసుకోగలడు. దుర్భరమైన ప్రసవ వేదనను ఒక గొడ్రాలు తెలుసుకోలేదు కదా!” అని ఈ శ్లోకం భావం. కాని దురదృష్టం ఏమిటంటే, ఈ కాలంలో పండితులు కూడా ‘గుణగ్రాహుల’వడం లేదు. ఒకరంటే ఒకరికి పడదు.
అందర్నీ మెప్పించడం అయ్యే పని కాదు! సరే! కానీ, అందర్నీ నొప్పించడం మాత్రం సులువేనండోయ్! దానికి గుణగ్రాహిత్వం అవసరం లేదు. మనసులో కుళ్లు ఉంటే చాలు. ‘దోషైకదృక్’లని ఉంటారు. వాళ్ళకు కేవలం తప్పులే కనబడతాయి. నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేశాడంటారు. ‘శంకరాభరణం’ గొప్ప సినిమాయే కాదంటారు. దానికంటే ‘జయభేరి’ వంద రెట్లు గొప్పదంటారు. ‘బాహుబలి’ సినిమా అంతా పాత చింతకాయపచ్చడి అంటారు. గ్రాఫిక్స్ ఉంటే గొప్పా? అనడుగుతారు.
సోషియల్ మీడియా వచ్చింతర్వాత ఈ మెప్పించడం దాదాపు అసాధ్యమై పోయింది. ఒకడు ఏదైనా మంచి విషయం పోస్ట్ చేస్తే పదిమంది దాన్ని చీల్చి చెండాడుతారు.
మహాత్మాగాంధీ గారే అందర్నీ మెప్పించలేకపోయారు. ధర్మ రాజును అజాతశత్రువంటారు, కాని ఆయన్నూ విమర్శించారు. ఒకసారి (1982లో అనుకొంటాను) నంద్యాలలో ‘భువనవిజయం’ జరిగింది. అష్టదిగ్గజాలలో ఒకరిగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు విచ్చేశారు. వారందరికీ సౌకర్యాలు సమకుర్చే పని నాకప్పజెప్పారు. ముందురోజు అందరూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. నేనక్కడే ఉన్నాను. కరుణశ్రీ గారిలా అన్నారు – “అందరినీ మెప్పించడం కష్టం. నా ‘కుంతీకుమారి’ పద్యాలు ఏమంత గొప్పవని, ఘంటసాలగారు పాడినందుకే వాటికి ప్రాచుర్యం వచ్చిందని ఒకాయన నాతోనే అన్నాడు. అంతటితో ఆగలేదు. ‘అదియొక రమణీయ..’అన్న పద్యంలో ‘దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్’ అని చివర్లో వస్తుంది. ఆ పద్యాన్ని ఒక ‘పదచిత్రం’గా చాలా మంది మెచ్చుకున్నారు కాని మనవాడేమన్నాడో తెలుసా? ‘మెట్ల మీదుగా కాకపోతే ఇంకెలా దిగుతుంది?ఇదీ ఒక కవిత్వమేనా?’ అని. అలా వుంటుంది కొందరితోని!”.
రాజకీయల్లోనూ అంతేనండి! ఎంత మంచి చేసినా, ప్రతిపక్షాలు మెచ్చుకోవు. పైగా ఘోరంగా విమర్శిస్తాయి. ఎన్.టి.ఆర్ గారి పాలనలో అప్పట్లోనే 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చేవారు. “బహిరంగ మార్కెట్లో 4 రూపాయలకే సన్నబియ్యం దొరుకుతూంటే ఇదేం గొప్పా?” అన్నారు కొందరు. కళాఖండాన్ని తీసినా చప్పరించి పారేసేవారు లేరాండీ! అప్పటి కళాఖండాలను కూడా వదలడం లేదు సోషల్ మీడియా. ‘కన్యాశుల్కం’లో ఒక్క సాయబు పాత్ర కూడా లేదని ఒకాయన ముఖపుస్తకంలో వాపోయాడు పాపం.
నిజాయితీపరులెప్పుడూ మెప్పు కోసం పనులు చేయరు. వారి త్యాగాలు, తర్వాత ఫలితాలనిస్తాయి. ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంద’ని ‘మాయాబజార్’లో శకునిగారు సెలవిస్తారు. కాని పొగిడేవాడికీ పొగిడించుకునే వాడికీ తెలుసు అదో ప్రహసనమని. జీతాలు తీసుకుని రాజులను పొగిడే వందిమాగధులుండేవారు! వారు ఏలినవారిని మెప్పించారా? అంటే అనుమానమే. అవన్నీ రొటీన్ డైలాగులే! “మెచ్చి మేక తోలు కప్పడం” అని సామెత ఈ మెప్పుదలలలోని డొల్లతనాన్ని సూచిస్తుంది.
సో, మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ఎవరూ మెచ్చుకోవాల్సిన పని లేదు. మన పని మనం నిజాయితీగా చేసుకుంటూ పోవడమే. తిట్టుకునే వారు తిట్టుకుంటారు. డోంట్ కేర్!
“ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని పాపం చేమకూర వెంకటకవిగారు బాధపడ్డారు, ఆనాడే! అది ఇప్పుడూ జరుగుతూంది!
~ “నా కవిత వింటారా మాస్టారు?”
“తప్పకుండా సార్! వినడమే కాదు మెచ్చుకుంటా! లైను కెంతిస్తారు?”
ఇలాంటివాళ్ళతో జాగ్రత్త!
సో, ఇంకో సామెతతో వచ్చేవారం.
5.సుబాణీయం (శీర్షిక)

వార్తలు కాదు.. వలలు
-నిజాన్ని మింగేస్తున్న తెరలు
-ఆలోచనను బంధిస్తున్న అలవాటు
-షేర్ కు ముందు ప్రశ్న అవసరం
ఈ రోజుల్లో దేశం ఎదుర్కొంటున్న అసలైన మంట అగ్గిపెట్టెల్లో లేదు, అక్షరాల్లో ఉంది. చేతిలో ఉన్న చిన్న తెర ప్రపంచాన్ని మింగేస్తూ మన ఆలోచనలను మడతపెడుతోంది. నిజం అనే పదం నిఘంటువుల్లో మిగిలిపోతోంది. చూసింది నిజమేనన్న భ్రమతో విన్నది వేదంలా మారుతోంది. ప్రశ్నించాల్సిన మెదడు ముందుగా షేర్ బటన్ నొక్కుతోంది. ఆలోచనకు ముందే ఆగ్రహం పరుగెత్తుతోంది. ఒకరు రాసింది వేలమందికి నమ్మకంగా మారుతోంది. బాధ్యత లేని వాక్యం దేశాన్ని చీల్చే ఆయుధంగా మారుతోంది. అబద్ధానికి వేగం ఉంది, నిజానికి మాత్రం నత్త నడక కూడా కష్టమయ్యింది. భావోద్వేగాలనే ఇంధనంగా చేసుకుని కొందరు ప్రజాభిప్రాయాన్ని తిప్పేస్తున్నారు. నిన్నటి పొరుగువాడు నేటి శత్రువుగా మారుతున్నాడు. మాటల మధ్యలో విషం కలిపి నవ్వుతో వడ్డిస్తున్నారు. చూసిన ప్రతిదీ నిజమని నమ్మే అలవాటు మనల్ని బానిసల్ని చేస్తోంది. ప్రశ్నించని వాడు ప్రమాదకరమైన పౌరుడవుతాడు.

స్వేచ్ఛగా ఆలోచించాల్సిన మనసు తీగలతో కట్టబడ్డ బొమ్మగా మారుతోంది. చేతిలో దీపం పట్టుకున్న సత్యం మూలన నిలబడి చూస్తోంది. అబద్ధం రాజసంగా వేదికెక్కి చప్పట్లందుకుంటోంది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందన్న సిద్ధాంతం ఇక్కడ అమలవుతోంది. మనిషి తన మేధస్సును అద్దెకు ఇచ్చి భావోద్వేగాలను కొనుగోలు చేస్తున్నాడు. నచ్చిన మాటే నిజమవుతోంది, నొప్పిచ్చే నిజం అబద్ధమవుతోంది. ఆలోచించడమే ప్రమాదంగా భావించే స్థితికి సమాజం చేరింది. ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు, ఎలా చెప్పారన్నదే ముఖ్యం అయింది. శబ్దమే సాక్ష్యం అవుతోంది. మౌనం నేరంగా మారుతోంది. తర్కం క్రమంగా అంతరించిపోతోంది. మనిషి తన గొంతును తానే మూసుకుంటున్నాడు. నేడు అబద్ధాన్ని పంచేవాడు హీరో అవుతున్నాడు. నిజాన్ని నిలబెట్టేవాడు ఒంటరివాడవుతున్నాడు. దీపం చిన్నదైనా వెలుగు విలువైనదే. ఒక్క ప్రశ్న వెయ్యి అబద్ధాలను కూల్చగలదు. ఒక క్షణం ఆలోచన దేశాన్ని కాపాడగలదు. షేర్ చేసే ముందు ఆలోచించడం ఇప్పుడు దేశభక్తి. నిజాన్ని గుర్తించడం నేటి అత్యవసర బాధ్యత. ఆలోచించే పౌరుడే ప్రజాస్వామ్యానికి ప్రాణం. మిగతాదంతా కేవలం శబ్దమే.
============================================================================

6. నిజం వెనుక దాగిన, అబద్ధపు ముసుగులు, దాచేస్తే దాగని అబద్ధాలు…
తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందో లేదో, నమ్మకాల్లో ప్రజలు కొట్టుకోవాలి!
టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో, ప్రజలు రెండుగా చీలి వాదులాడుకోవాలి!
UGC rules controversy, కొత్త నిబంధనలు, మళ్ళీ సుప్రీం కోర్టు స్టే…,
ఫ్యూచర్ సిటీ బాగుంటుందా? మూసీ నది ప్రక్షాళన నిజంగా జరుగుతుందా?
మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణ నగరాల్లో కార్యకర్తలకు కొన్నాళ్ళు పండగ! భోజనాలు, దావతులు!
రాజకీయ ఆటలో, సినిమా పాటలో, మద్యం మత్తులో.., ఎన్నో విషయాలు.., .డైరెక్టుగా చెప్పినా అర్థం చేసుకోలేని మెజారిట్ ప్రజలు మన దేశంలో ఉన్నారు!
ఇక మసిపూసి, మారేడుకాయ చేసి, కప్పి కప్పి చెబితే .. బ్రహ్మ పదార్థం చేసి ప్రజలను మాయ చేస్తే…, ఎంత దారుణం?!
దీని మీద జనం ప్రభ, ఆంధ్ర ప్రభ తన వెలుగు కిరణాలు ప్రసరింప చేస్తుంది! సత్యం వైపు, ధర్మం వైపు నిలబడుతుంది!
రాజకీయ, సినిమా, నాటక, సాహిత్య రంగాల్లో విమర్శ విశ్లేషణలలో ప్రమాణాలు పాటించాలి!
ఉదాహరణ, విశ్లేషణలతో కొన్ని నిజాలు చూసే ప్రయత్నం చేద్దాం!
ఒక నాటక పరిషత్ జరిగింది! అందులో కొన్ని నాటకాలు బాగాలేవు, అన్ని నాటకాలు బాగాలేవు అని చెప్పడం ఒక పెద్దాయన ఉద్దేశ్యం! విమర్శ చేశారు ఆయన. నాటక పరిషత్ పేరు చెప్పరు. ఏ నాటకాలు బాగాలేదో చెప్పరు!
కొన్ని రోజుల క్రితం ఒక విమర్శ చూశాను వీటన్నిటితో పాటు, రాజకీయాలు కూడా ముడిపెడుతూ సోషియల్ మీడియా యూనివర్సిటీలో. అంతా గుంభనం!
వ్యాసంలో అభిప్రాయాలు బాగున్నాయి. Idealistic.
ఎక్కడెక్కడివో కొన్ని వాక్యాల ముక్కలు తెంచి దండ కుట్టి అతికించారు!
వేరే ఎక్కడో చదివినవో, ఎవరో అన్నవో కోట్ చెయ్యడం కాకుండా అన్నీ మీరే మొదటి సారి అన్నవేనా అనే విషయం వివరణ అవసరం. లేదంటే ప్లాగరిజం చట్టం ఉంది!
ఎందుకంటే ఆ జనరల్ expressions వేరే చోట చదివాము అని మనకు తెలుసు. (ఒక్క రావి శాస్త్రి గారి పేరు మాత్రమే mention చేశారు) (కొ.కు., కె.వి.అర్. లాంటి వారు, ఇంకా స్త్రీ, దళిత వాద ఉద్యమాల్లో, అభ్యుదయ ఉద్యమం సమయంలో…ఈ భావాలు, అవే వాక్యాలు ఎందరో వినిపించారు. (అందుచేత వేరే వారి మాటలు మన వ్యాసంలో వాడి నప్పుడు ఆ Source రచయిత పేరు చెప్పడం మన బాధ్యత. కనీస నైతికత).
నాటకం లేదా సాహిత్యం, రాజకీయ సినిమా కళా రంగాలు, పేదల పక్షాన, ప్రజల పక్షాన, అణచి వేతకు గురి అవుతున్న వారి పక్షాన ఉండాలి అంటున్నారా? కథలు పరంగా…? మనం ఏం ఆశిస్తున్నాము అసలు?!
లేదా నాటకం, సినిమా Quality పరంగా, నటన పరంగా, ఇంకా సాంకేతికంగా …, మనం ఏ గుణాత్మక మైన మార్పులు కోరుకుంటున్నాము, ముఖ్యంగా మన తెలుగు సినిమా మరియు నాటక రంగాల్లో?!
ఇక తెలుగు రాజకీయాల్లో అయితే?! బూతులు, ఇళ్ల మీద, పార్టీ ఆఫీసులు మీద దాడులు! వీటిని మించి మన నాయకుల ప్రజల, నైతికత ఎదిగే రోజులు వస్తాయా?!
కర్ర విరగ కూడదు. పాము చావ కూడదు. అంటే కుదరదు. నేను మంచి వాడు గానే ఉండాలి. నా నాటక సరదాలు, రాజకీయాలు, నామినేటెడ్ పదవులు, బంగ్లా, కారు ప్రయాణాలు, వేరే పరిషత్ లలో వచ్చే Judge హోదాలు, అవకాశాలు,..,North zone, South zone festivals, Youth festivals లలో పదవులు… పెద్ద మనిషి కుర్చీ.., , గొప్ప వాడు అనే పేరు పోకూడదు …, అని , “విమర్శ కానీ విమర్శ”, “విశ్లేషణ కాని విశ్లేషణ” చేస్తే ఏం ఉపయోగం? అది రాజకీయ రంగం అయినా, కళారంగం అయినా కూడా?
సచిన్ టెడూల్కర్ example చెబుతారు, పెద్ద బూతు! ఒక్కరు నెగ్గడం కాదు దేశం నెగ్గాలి!
నిరంతరం మనం మంచి వారుగానే ఉండాలి అనే బరువు ను భారత జాతి మోయలేక వందల తరాలు నష్ట పోయాయి .
నేడు అందరి కళ్ళలో కన్నీరు. బాధ. దేశం అంతా వేల సమస్యలు. దోపిడీ. అవినీతి, నిరుద్యోగం. డంకీలు గా విదేశాలకు వలస. మన దేశ విషాదం వర్ణించ డానికి ఎన్ని కావ్యాలు రాయాలి ?!
నాలుగు స్తంభాల భవనం మన దేశం అనుకుంటే…, రెండు స్తంభాలు గొప్పగా ఉన్నాయి. మన ధర్మం, ఆధ్యాత్మికత, మన ప్రాచీన వాజ్మయం విశ్వాంతరాలాల్లో వ్యాపించాయి. మిగతా ప్రపంచం మన భగవద్గీతలో ఒక వాక్యం విలువ చెయ్యక పోవొచ్చు. (It’s a debate), ..
కానీ వేరే రెండు స్తంభాలు పాతాళానికి వెళ్ళి పోయాయి. ఇది వాస్తవం. మన దేశం వేల ఏళ్ల క్రితం బ్రాహ్మణ స్థితిలో (కులం కాదు) ఉంది, మరి మిగతా ప్రపంచం ఒక శూద్ర స్థితిలో ఉన్నప్పుడు…, ఆ దేశాలు వచ్చి మనల్ని దురాక్రమణ చేసినప్పుడు… (చేస్తాయి అని ఊహించక పోవడం)
దేశంలో అంతర్గత ఐక్యత…, లేక, 580+ సంస్థానాలు గా ఉన్న దేశం, కొన్ని పెద్ద రాజ్యాలు…, వాటి మధ్య ఐక్యత లేక, అంతర్గత కనీస సమన్వయం లేక, …, వేరే దేశాల్లో ఒకటి రెండు, నాలుగు ఐదు శతాబ్దాలలో పుట్టిన కొత్త మతాలు…, అబ్రహామిక్ రెలిజియన్స్ పుట్టుక, ఎదుగుదల, వాటి ప్రభావం, వాటి వల్ల రాబోయే వందల ఏళ్లలో వచ్చే ప్రమాదాలు వాటిని అంచనా వేయడంలో (పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం … ఇంకా పూర్వం) మన దేశం అప్పటి మేధావులు పూర్తిగా విఫలం అయ్యారు.
పోనీ కొలంబస్ 1492 లో సాక్టా మారియా షిప్ లో అమెరికాను కనుకొనడం, వాస్కోడిగామా 15 వ శతాబ్దంలో India ను కనుగొన్నాకా (సముద్ర మార్గం)…, (అప్పటికే డబ్బై శాతం నాశనం అయ్యి ఉన్నాము మనం!
నీచులు, మూర్ఘపు మతాలు మనల్ని ఏలుతున్నాయి. వీటి తర్వాత కూడా మన భారత ఉప ఖండం జాగ్రత్త పడలేదు. శైవ, వైష్ణవాల ఘర్షణ…, (ఆది శంకరాచార్యులు, శ్రీరామానుజులు, మధ్వాచార్యులు …కొంత మంచి జరిగినా, గుణాత్మక మైన మార్పు, మెరుపు ఎంత జరిగింది అనేది చర్చ, నేటి భారతం మనం చూసినప్పుడు).
కీస్తు శకం ప్రారంభం తర్వాత…,
మధ్య ప్రాచ్యంలో ఫస్ట్ టెంపుల్ ని పడ గొట్టడం, అక్కడి యుద్ధాలు, దాని ఫలితాలు మన మీద ఏం ప్రభావం చూపవు అనుకున్నారు.
కింగ్ సోలమన్(King Solomon) నుంచి అలెగ్జాండర్ వరకూ…, ఇక గజనీ మహమ్మద్ దోపిడీ…, తరాల చరిత్ర…,భయ పడి పోయింది మన జాతి. పిరికి తనంతో వణికేలా చేశారు. భయ పడిన మన జాతి, ధైర్యం కోల్పోయిన మన ప్రజలు.., గత ఐదు వేల సంవత్సరాల నుంచి జాతి భయంలోనే బ్రతుకు తోంది.
రేపు అన్నం దొరుకుతుందో లేదో అనే భయం. రోజూ అభద్రత లోనే బ్రతుకుతున్నాము.
రాజు దైవాంశ సంభూతుడు, ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడకుడడు. ప్రజలు “మంచి” వారు గా ఎపుడూ ఉండాలి.
అపుడే పద్మ శ్రీలు, పద్మ విభూషణ్ లు వస్తాయి. ఏమో highest civilian award కూడా రావొచ్చు మన పనికి మాలిన diplomacy కి.
“ద్రౌపతి కి వస్త్రాపహరణం జరుగుతోంది, ఇంకా తలలు ఎత్తడం అలవాటు కాలేదు” అని నేను నా published poem లో రాసుకున్నా. శ్రీనివాసరాజు ది ఒక కులం కాదు. అతను ఒక మనిషి. మానవ అధ్భుత మేధస్సులో అతనూ ఒక భాగం.
ఒక కులం వారే గొప్పవారు, వారికే అన్నీ తెలుస్తాయి, లేదా వారే అన్నీ రాయాలి అనే మాటకు పైడి తెరేష్ బాబు ఇచ్చిన సమాధానం గొప్పది. ” మాట మాకు కొత్త కాదు, మీరు పలకల బావుల్లో బలపాల కప్ప లైనప్పుడు మేం నేల తల్లి గుండెల మీద పైరు పద్యాల మయ్యాము.
మీరు విజ్ఞానపు సముద్రాల్లో కాగిత పు పడవలైనప్పుడు…
మా కడుపులో పడ్డాకా కదా, అక్షరం అగ్ని పునీతమైంది.”
అందుచేత ఈ కులం ప్రామానికత నుంచి బయటకు వచ్చి విషయం నిర్మాణాత్మకంగా చూద్దాము.
బుద్దుడు తర్వాత నిజానికి అంతా నవీన యుగం క్రిందే లెక్క. అంటే కొత్త యుగం ప్రారంభం అయ్యి…ఇరవై ఆరు వందల సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ ఈ భూమి మీద ఒక ఆదర్శ అభ్యుదయ సమాజం ఏర్పడ లేదు. అన్నీ చోట్లా…, ఎన్నో విషయాల్లో వైరుధ్యాల కొట్లాటలు జరుగుతున్నాయి.
ఒక ⚖️ balance, ఒక tranquility మనుషుల మధ్య, దేశాల మధ్య ఏర్పడలేదు.
తెలుగు నాటకం, తెలుగు సినిమా ప్రపంచాన్ని కదపాలి, కలపాలి, కదిలించాలి అనేంత పెద్ద ఆశ నాది. అలాగే భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, గొప్ప గురువుగా నిలబడాలి!
ఆ సమన్వయం తెలుగు నేల నుంచి జరుగుతుంది అని నా నమ్మకం. అది మనందరి ఆశయంగా ముందుకు కదలాలి. ఎందుకంటే మనలో అంత సమర్థులు ఉన్నారు. తెలుగు నేల చైతన్యం అనన్య సామాన్యం!
సాహిత్యంలో భాగం అయిన నాటకం ఒక్కటే ఈ సమస్యలను చర్చించి ఒక పరిష్కారం వైపుగా మానవ జాతిని నడిపించ గలదు అని నమ్ముతున్నాము కనుక ఈ వ్యాసం రాస్తున్నాము. మీరు బాధ్యతతో చదువుతున్నారు నిజాలు.
వందల ఏళ్లు మొఘల్ సామ్రాజ్యం చేసిన దోపిడీ, అరాచకం, హత్యాచారాలు, హింస, హైందవ ధర్మం, హైందవ సంస్కృతి పై దాడి, హైందవ స్త్రీల పై జరిగిన అకృత్యాలు… మన ఆచారాలు, వ్యవహార శైలి…, అన్నిటినీ హీన పరిచారు.
ఎదిరించిన ఎందరి తలలో కోట గుమ్మాలకు వేలాడాయి. అక్బరు తో సహా అందరూ ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఏలారు. .
మొత్తం జాతిని, సైన్యంతో భయ పెట్టి,…, మధ్యలో బిస్కెట్స్ వేసినట్టు మత సామరస్యం డ్రామాలు ఆడారు..
అక్బరు కి మూడు వందల మంది భార్యలు. 9 వ తరగతి పాఠ్య పుస్తకం చూడండి. రహస్యంగా రెండు వేల మంది భార్యలు ఉన్నా రంట. ఇవి నిజాలు. ఇన్నాళ్లు దాచారు.
ఆ తర్వాత బ్రిటీషు నీచులు. ఆర్థిక దోపిడీ తో పాటు, అప్పటికే మిణుకు మిణుకు మంటున్న మన జాతిని మరింత దెబ్బ కొట్టారు. మన ఆచార వ్యవహారాలను మరింత హీన పరిచారు. మా దేవుడు నిజమైన దేవుడు, మీ హిందూ దేవుళ్లు అంతా సైతానులు అంటూ…, మత ప్రచారాలు.
తాము వెళ్ళిపోయినా, తమ క్రైస్తవ మతం ఈ దేశాన్ని పరి పాలించాలని సుదీర్ఘ వ్యూహాత్మక కుట్రలతో పాలన చేశారు.
(కాటన్ దొర(?!), సి. పి. బ్రౌన్ లాంటి ఒకరిద్దరు సరిపోరు).
మన మనుస్సుల్లో, ఆత్మల్లో, ఆ తెల్ల తోలు వెధవలు గొప్పవారు అని నాటుకునేలా ఎన్నో వ్యూహాలు, రచనలు చేశారు.
(మన తెలుగు నాటకాల్లో, మన తెలుగు సినిమాలలో ఇలాంటి challenging కథలు తీసుకో గలమా? )
(నిజాల చరిత్ర చూడని సూడో మేధావులు విమర్శలు పక్కన పెట్టి)
హిందువులు (భారతీయులు అంతా) అమాయకంగా, ఏం కాదు, అంటూ మొద్దు నిద్ర పోయారు. ఎంతో నష్ట పోయారు.
మన వీథి లో చెత్త ఉంటే మాట్లాడే నాథుడు లేడు. అక్కడ చిన్ని రాజకీయ నాయకుడు చేసే అవినీతిని ప్రశ్నించ లేము. ఎందుకంటే మనం సచిన్ టెండూల్కర్ లా మంచిగా ఉండాలి. (సచిన్ ని గవాస్కర్ అలా బ్రెయిన్ వాష్ చేశాడు. నువ్వు ఇలా ఉండు దాని వల్ల నీకు మరింత పేరు, కీర్తి వస్తాయి …, ఇపుడు సచిన్ టెండూల్కర్ దేశంలో ఏ సమస్య గురించి పోరాడు తున్నాడు? సంపాదించిన డబ్బుతో దుప్పటిలో ముసుగు పెట్టి పడుకున్నాడు.
దేశంలో ఇన్ని సమస్యలు ఉంటే… ,అతనికి బాధ్యత లేదా? !
ఢిల్లీ లో రైతులు సమ్మె…, వాయు కాలుష్యం, ఇంకా ఎన్నో. ఒక influencer గా అతను ఏం చేశాడు?
ఒక ఆటగాడు గా అతని క్రమ శిక్షణ…, సహనం, ఫిట్నెస్.., నేర్చుకో దగ్గ అంశాలు. కానీ…
జీవితం ఒక రోబోట్ యంత్రం కాదు. కేవలం మెకానికల్ గా నడవడానికి!
ఇక మన విషయానికి వస్తే…, నిర్మాణాత్మక మైన విశ్లేషణ, లేదా విమర్శ సూటిగా పేరులు mention చేసి…, చెబితే, ఆ చెప్పే వారికీ, విన్న వారికీ అందరికీ ఉపయోగం.
లేదా, మన కీర్తి, మన కుర్చీలు, మన పేరు ప్రఖ్యాతులు, మన దండలు, శాలువాలు…, అన్నీ మనకు కావాలి…, తెర వెనుక నుంచీ ఏదో అలా అంటీ ముంటనట్టు మాట్లాడతాము అంటే కుదరదు. ఇక మీ ఇష్టం.
(ఒక్క త్యాగం చెయ్యకుండా, రిటైర్ అయ్యాకా జీవితంలో ఏదో ఒక వ్యాపకం, సరదా, ఒక కాలక్షేపం కోసం నాటకం, సిన్మా, లేదంటే పోగు పడ్డ అక్రమ సొమ్ము కాపలా కోసం రాజకీయం అంటే…, పరిషత్తుల వెంట ప్రయాణం అంటే, ప్రెస్ మీట్లు డ్రామాలు అంటే….. ఎంత డొల్ల. ఎంత పతనం, హృదయాంతరాలాల్లో! దయచేసి ఆలోచించండి)
(మీ కపటత్వాన్ని, స్వార్థాన్ని గమనించని తరమా ఇది? ఏం అనుకుంటున్నారా? మెరిసే అగ్ని కణాలు లాంటి విజ్ఞాన వంతులు కూడా నేడు తెలుగు రాజకీయ, సినిమా, నాటక సాహిత్య రంగాల్లో ఉన్నారుఅన్నీ కనిపెడతారు. గత కాలపు, మితవాదపు గారడీలు నమ్మరు! మహాకవుల మాటలు నడిపిస్తాయి!
(ఎన్నో అద్భుతాలు జరగ బోతున్నాయి)
ప్లాస్టిక్ నవ్వులు నవ్వుకుంటూ…, హే నేను గొప్పోన్ని, నీ కన్నా గొప్పోన్ని,…, నా ముందు నువ్వు ఎంత? నా దగ్గర ఎన్ని నందులు ఉన్నాయో తెలుసా?! ఎన్ని బిరుదులు, ఎన్ని శాలువాలు? ఎన్ని చెక్కలు?!!!! ఎన్ని దండలు! ఎన్ని భజనలు! అమ్మో!
నేను ఎంతో చేశాను నాటక రంగానికి? నువ్వు నిన్న వచ్చి మాట్లాడతావా? నేను ఎన్ని వీథి నాటకాలు వేశానో తెలుసా? (సరే ఇంతకీ, ఎంత సంస్కారం నేర్చుకున్నావు? ఎంత సహనం? ఎంత విశాల దృక్పథం…., ఎంత క్షమ,..ఎంత ఆదర్శం?! వ్యక్తిగా, లేదా ఒక స్త్రీగా ఎంత ఎదిగావు? హృదయంలో, బయటా?!
ఇలా ప్రశ్నించుకుని ఆత్మ విమర్శ చేసుకోరు, కుళ్ళిన మనస్సులతో గబ్బిలాల్లా వ్రేలాడుతూ కంపు కొడుతున్నారు!
దయ చేసి కొత్త నీటికి స్వాగతం పలకండి. హుందాగా ఉండండి. లేదా తప్పుకోండి!
ఎంత కోయిల పాట వృధ అయ్యానో కదా చిక్కు చీకటి వన సీమల యందు? మహాకవి జాషువా మాటలు గుర్తు చేసుకుందాము!
అరే, మీరు మీ జీవితం కోసం, మీ ఇష్టానికి, మీ సరదా కోసం, మీ కాలక్షేపం కోసం, లేదా మీ జీవన భృతి కోసం, మీ విలాస జీవితం కోసం, లేదా సినిమాల్లో అవకాశాల కోసం, లేదా ఇంకా ఏవో పేరు ప్రఖ్యాతుల కోసం, మీ కీర్తి కోసం ఇన్నాళ్లు ఉన్నారు. ఎన్నో ఆశించి భంగ పడి ఉండ వచ్చు.
ఇంకా డబ్బు కోసం… ఎన్నిటి కోసమో ఉన్నారు. ఇప్పుడు వానప్రస్థంలో పరిషత్తుల చుట్టూ భ్రమణం, రాజకీయ వేదికలు మీకు ఒక విలాసం, సరదా!
అదే నిజం.
ఏదో దేశాన్ని ఉద్దరించినట్టు Build ups ఇవ్వొద్దు. వయసు పెరిగింది. దాంతో 60 లేదా 70 లేదా, 80 ఏళ్లు నుంచి ఉన్నట్టు ఒక లెక్క వస్తుంది. అది చూపించి సింహాసనం అడగ వొద్దు.
మీరు ఓజోన్ పొర చిరిగితే కుడుతున్నట్టు పోజు కొడుతూ…, అంత చేశాం, ఇంత చేశాం అని అరవొద్దు. అబద్దంలో బ్రతకొద్దు.
మంచి చేస్తే ప్రజలు మరచిపోరు.
నిజంగా త్యాగాల పునాదులు మీద నాటకాలు వేసిన టి.జే. రామనాథం, ప్రసాద మూర్తి, గద్దర్ వంగపండు, ఇంకా ఎందరో జానపద కళాకారులు, పద్య నాటక కళాకారుల కృషిని గౌరవిద్దాం!
అలాగే…
నిజంగా నిస్వార్థంగా ప్రజల కోసం బ్రతికిన వారికి, ప్రజా నాయకులకు మన మనస్సుల్లో గౌరవం ఉంటుంది.
మేం నాటకాలు వేసుకుని వెళ్ళిపోతాము. సినిమాలు, రాజకీయాలు చేసుకుని వెళ్ళిపోతాం, మీరు చూసుకుని, మూసుకుని వెళ్ళిపోండి అంటే కుదరదు.
ప్రజలకు, ప్రేక్షకులకు, ఓటర్ల సమస్యలు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. స్పందించాలి! విమర్శను వినాలి. విశ్లేషణ ను సహృద్భావ వాతారణంలో అర్థం చేసుకోవాలి.
వజ్రం మెరవాలి అంటే…, తెలుగు నాటకం, సినిమా, రాజకీయాలు ఎదగాలి అంటే.. ఎన్నో చర్చలు జరగాలి. కళలు, కలలు కలిసి ప్రజలను నడిపించాలి!
సర్వేజనా సుఖినోభవంతు! ఓం శాంతి!
— శ్రీనివాస రాజు పెన్మెత్స 9550 981 531 (థియేటర్ పిహెచ్.డి స్కాలర్)
___________________________________________________________
7.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశుని సన్నిధిలో
రంగనాథస్వామి
తిరుమలేశుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న గరుడాళ్వార్ సన్నిధికి వెనుకవైపుగా తూర్పు ముఖంగా ఉన్న రంగనాధ స్వామి కొలువైఉంటారు. ఆలయంలోని వెండివాకిలి దాటిన వెంటనే ఎదురుగా ఉన్న శిల్ప అమరికలో పైన వరదరాజస్వామి, కింద వెంకటేశ్వర స్వామి మధ్యలో రంగనాథస్వామి చిన్న విగ్రహ రూపులుగా దర్శనమిస్తారు. మూడు ప్రధాన వైష్ణవ మత క్షేత్రాలైన కంచి, శ్రీరంగం, వేంకటాచల క్షేత్రాలను ప్రతిబింబించే ఆ మూర్తుల అమరిక ఉంటుంది. రాతి విగ్రహ రూపంలో ఉన్న ఆ అమరికను 1991 ఆగస్టు 1 న ఒక దాత సమర్పించిన రూ 55 లక్షల నిధులతో బంగారు పూతపూసిన రాగిరేకులతో అలంకరించారు.
తొలుత విమాన ప్రాకార మార్గంలో భక్తులు సమర్పించే పొర్లుదండాల అంగప్రదక్షిణ మొక్కుబడులు అక్కడ నుంచి మొదలు పెట్టి అక్కడికి చేరుకోవడంతో పూర్తి అయ్యేది. కాలక్రమంలో ప్రస్తుతం బంగారుబావి వద్ద మొదలై స్వామి హుండీ వద్ద ముగిసే ఏర్పాటు మాత్రమే అమలులో ఉంది.
అదేవిధంగా ఒకప్పుడు అక్కడే స్వామికి భక్తులు కొబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించే గరుడగంబ మనే వ్యవస్థ ఉండేది. భక్తుల రద్దీ కారణంగా కాలక్రమంలో అక్కడి నుంచి (ప్రస్తుత) ధ్వజస్తంభం వద్దకు, తరువాత ఆలయం వెలుపలకు ( ఇప్పటి బయో మెట్రిక్ వ్యవస్థ స్థానంలో) తరలుతూ ప్రస్తుతం ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం వెనుకవైపుగా , బేడీ ఆంజనేయస్వామి గుడి ముందున్న స్థలానికి చేరుకుని అఖిలాండం గా ప్రసిద్ధి చెందుతోంది.
ఓం నమో వేంకటేశాయ
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

