AP | ప్రజల వద్దకు నెలకు పలుమార్లు వెళ్లే సీఎం దేశ చరిత్రలో లేరు

AP | ప్రజల వద్దకు నెలకు పలుమార్లు వెళ్లే సీఎం దేశ చరిత్రలో లేరు
భూ హక్కుల పరిరక్షణ, సూపర్ పాలన లక్ష్యంగా ప్రభుత్వం….
మంత్రి అనగాని సత్యప్రసాద్.
AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పరిధిలోని కలుగొట్లలో నిర్వహించిన న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కూడా నెలకు ఆరు, ఏడు సార్లు ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజల మధ్యకు వస్తున్నారని వివరించారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబాటు…
2014 నుంచి 2019 వరకు రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. అయితే 2019లో కొందరు నాయకులు అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గం నుంచి వెనక్కి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ‘సూపర్ పాలన’ అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ప్రమాణ స్వీకార దినానే కీలక నిర్ణయాలు…
ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేశారని మంత్రి వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 16 వేలకుపైగా ఉద్యోగాలతో డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారని తెలిపారు. ప్రజల ఆస్తి హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశారని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచినట్లు వెల్లడించారు.
భూ రికార్డుల ఆధునీకరణకు ప్రాధాన్యత…
2008లో ప్రారంభమైన భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని 2016లో ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్’గా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.32 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రీ-సర్వే పేరుతో ప్రజల హక్కులను హరించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం గ్రామసభలు నిర్వహిస్తూ 90 శాతం భూ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన సమస్యలను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఆధునిక భద్రతా ఫీచర్లతో పాస్‌బుక్స్…
గతంలో భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పీలేట్ అథారిటీ, సివిల్ కోర్టు, అవసరమైతే హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చేదని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం 14 రకాల భద్రతా ఫీచర్లు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. గతంలో పాస్‌బుక్‌లపై నాయకుల ఫోటోలు ముద్రించేవారని, కానీ ముఖ్యమంత్రి ప్రజల ఆస్తిపై వారి ఫోటోలు అవసరం లేదని స్పష్టం చేశారని చెప్పారు.
22ఏ జాబితాలో భూముల పరిశీలన…
రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల ఎకరాల భూమి వివిధ కారణాలతో 22ఏ నిషేధిత జాబితాలో ఉందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ భూములు ఈ జాబితాలో ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు, పాస్‌బుక్, సర్వే సమస్యలను పరిష్కరిస్తున్నారని వివరించారు.
పారదర్శక విధానంతో పాస్‌బుక్స్ జారీ….
డ్రాఫ్ట్ పాస్‌బుక్ ముందుగా రైతుల ఇంటికే పంపించి, e-KYC పూర్తైన తర్వాత తుది పాస్‌బుక్ ముద్రించి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల ఆస్తి హక్కులను కాపాడేందుకు పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్ తరాల కోసం కృషి…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం రోజుకు 20 గంటలు పనిచేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం మంచి నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
