Devotees | వైభవంగా మాఘ పౌర్ణమి గిరి ప్రదక్షణ..

Devotees | వైభవంగా మాఘ పౌర్ణమి గిరి ప్రదక్షణ..
- ఇంద్రకీలాద్రి చుట్టూ విహరించిన స్వామివారు అమ్మవారు..
- భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తజనం
Devotees | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన మహాగిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో, అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు (Devotees) ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను ఉదయం సరిగ్గా 5.55 గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రారంభించారు. శాస్త్రోక్త మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన ఈ ప్రదక్షిణలో భక్తులు భక్తిశ్రద్ధలతో అడుగులు వేస్తూ ముందుకు సాగారు. పల్లకిపై కొలువుదీరిన అమ్మవారు, స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేశారు.

జై దుర్గ.. జై జై దుర్గ’ అనే నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తుల కీర్తనలు, భజనలు, శివనామ స్మరణలతో ఘాట్ రోడ్డు (Road) మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగింది. గిరి ప్రదక్షిణను సజావుగా నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సౌకర్యాలు, క్యూలైన్లు, భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, ఉత్సవ విభాగం సూపరింటెండెంట్ సునీత, ఇతర ఆలయ సిబ్బంది, వేద పండితులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. గిరి ప్రదక్షిణ కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై, కుమ్మరిపాలెం,సీతారా జంక్షన్, చిట్టినగర్ మీదుగా సాగి, చివరగా ఘాట్ రోడ్డులోని అమ్మవారి ఆలయం వద్ద ముగిసింది. మాఘ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు నశించి, కుటుంబానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) భక్తుల పోటెత్తడం విశేషంగా కనిపించింది. మొత్తంగా మాఘ పౌర్ణమి మహాగిరి ప్రదక్షిణ విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా మార్చి, భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

CLICK HERE TO READ హంసలదీవి, మంగినపూడి బీచ్ వద్ద భక్తుల రద్దీ
