816 at once | దేశ రాజకీయాల్లో బిగ్ షేక్ !

816 at once | దేశ రాజకీయాల్లో బిగ్ షేక్ !
816 at once | ఆంధ్ర్రప్రభ, వెబ్డెస్క్ : ఏప్రిల్ 16, 2026.. ఈ తేదీ భారత చరిత్రలో ఒక అరుదైన అధ్యాయంగా మిగిలిపోనుంది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ ఈరోజు సీన్ వైవిధ్యంగా నడిచింది. చట్టసభ లోపల సంఖ్యల యుద్ధం మొదలైంది. 543 గా ఉన్న లోక్సభ సీట్లు.. ఒక్కసారిగా 816 కి మారడం అంటే..ఇది కేవలం సీట్ల పెంపు కాదు, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ‘మాస్టర్ ప్లాన్’.
816 సీట్లు.. పవర్ మ్యాప్ మారుతోందా?
ఎందుకీ హడావుడి? సమాధానం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ‘మహిళా రిజర్వేషన్’. 33 శాతం కోటా అమలు చేయాలంటే, ఉన్న సీట్లలో కోత పెడితే పురుష నేతల నుంచి తిరుగుబాటు తప్పదు. అందుకే ‘సీట్ల సంఖ్యనే పెంచేద్దాం’ అన్నది ప్రభుత్వ వ్యూహం. ఈ లెక్కన కొత్తగా వచ్చే 816 స్థానాల్లో సుమారు 273 సీట్లు మహిళలకే కేటాయిస్తారు. అంటే రేపటి పార్లమెంట్లో మహిళా గళం మునుపెన్నడూ లేని విధంగా గర్జిస్తుందన్నమాట!

దక్షిణాది గుండెల్లో రైళ్లు..
అయితే, ఇందులో ఒక చేదు నిజం దాగుంది. సీట్ల పెంపు ‘జనాభా’ ప్రాతిపదికన జరిగితే.. అక్షరాస్యత, జనాభా నియంత్రణలో టాప్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలకు అది శాపంగా మారుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు సభలో మంటలు పుట్టిస్తోంది. “మేము అభివృద్ధి బాటలో నడిచినందుకు మాకు ఇచ్చే బహుమతి సీట్ల కోతనా?” అంటూ దక్షిణాది ఎంపీలు చేసిన నినాదాలు సభను హోరెత్తించాయి.

చారిత్రక మలుపు..

కేంద్ర హోంమంత్రి బిల్లును ప్రవేశపెట్టిన తీరు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన తీవ్రమైన ప్రతిఘటన.. ఇవన్నీ చూస్తుంటే భారత ప్రజాస్వామ్యం ఒక ‘బిగ్ ట్రాన్స్ఫర్మేషన్’కు సిద్ధమైందని అర్థమవుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ప్రాంతీయ అసమానతలు ఎలా తొలగిస్తారు? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒకవైపు మహిళా సాధికారత.. మరోవైపు ప్రాంతీయ ప్రాధాన్యత. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పార్లమెంట్ ఈరోజు సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఎంపీల సంఖ్య పెరగడం సరే.. మరి సామాన్యుడి గొంతు ఆ 816 మందిలో ఏ మేరకు వినిపిస్తుందనేది వేచి చూడాలి.
CLICK HERE TO READ MORE : Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్
