23aprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం

23aprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం
23aprilchintana | తత్త్వ విచారణ ప్రాముఖ్యత
కర్కటి జీవితం: హింస నుంచి తపస్సు వరకు
రాజు, మంత్రి తో తత్త్వ సంభాషణ
జ్ఞానం ద్వారా సంశయ నివృత్తి
కర్కటి మార్పు మరియు జీవన సారం
23aprilchintana | తన బుద్ధితో ఆలోచించే సామర్థ్యం ఉన్న మనిషికి తత్త్వ సంబంధమైన విచారం కూడా అవసరం. తత్త్వ విచారణ ద్వారా లభించిన జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేసి, సంసార బంధనాలను తొలగించి, మోక్షాన్ని సులభతరం చేస్తుందని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠరామాయణం’లోని ‘కర్కటికోపాఖ్యానం’ స్పష్టంగా వివరిస్తుంది.

కర్కటి జీవహింస చేసి ఆకలి తీర్చుకుంటూ బ్రతికే ఒక రాక్షసి. హిమాచల అంతరాలంలోని ఘోర అరణ్యాల్లో దాని నివాసం. కొంతకాలానికి తన హింసాత్మక ప్రవృత్తిపై తానే విసిగి, ఇంద్రియ నియంత్రణతో నిరాహారిగా, నిత్య సమాధిలో నిలిచి కఠోర తపస్సుకు పూనుకుంది. అలా సంవత్సరాల పాటు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, “ఇలాగే ఆహారం మానేసి తపస్సు చేయడం నీకు ఎందుకు? అది నీ స్వభావానికి విరుద్ధం. మునుపటిలాగే జీవనం కొనసాగించు. చెడు అలవాట్లతో పాడైపోయినవారిని, దుర్మార్గులను వెదికి భక్షిస్తూ జీవించు” అని చెప్పి వెళ్లిపోయాడు.
బ్రహ్మ చెప్పినట్లు చేయాలని అనుకున్నప్పటికీ, వెంటనే ఆ మార్గాన్ని అనుసరించలేదు కర్కటి. మరికొన్నేళ్లు సమాధి స్థితిలో గడిపి, చివరకు పూర్వపు స్వభావం మళ్లీ మెదిలి, ఆహారకాంక్షతో ఆహారం కోసం వెదకసాగింది. అలా వెదుకుతుండగా అడవిలో వేటకు వచ్చిన విదేహ రాజు మరియు అతని మంత్రి కర్కటి కంటపడారు.
వారిని చూసిన కర్కటి, “మీ ఇద్దరూ నా చేతికి చిక్కారు. ఈరోజు మీ ప్రాణాలు అంతమవుతాయి. అయితే మీకు నొప్పి కలగకుండా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని సంహరిస్తాను” అని చెప్పింది. కానీ వెంటనే, “లేదంటే నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి” అని షరతు పెట్టింది. అలా ఆత్మజ్ఞానం, వేదాంతానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి, “సమాధానాలు చెప్పలేకపోతే నా ఆహారమవుతారు” అని హెచ్చరించింది.
ఆ ప్రశ్నలు రాజు, మంత్రికి మొదట అర్థంలేని వట్టిమాటలుగా అనిపించినా, రాజు మంత్రిని ప్రోత్సహిస్తూ, “ఇవి కఠినమైన ప్రశ్నలు అయినా, వీటికి సరైన సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నించు” అన్నాడు. మంత్రి తన తర్కబుద్ధితో వీలైనంత సముచితంగా సమాధానాలు ఇచ్చాడు.
మంత్రి సమాధానాలు విన్న కర్కటి, అతన్ని తత్త్వవేత్తగా ప్రశంసించి, తర్వాత రాజుని కూడా సమాధానాలు అడిగింది. రాజు కూడా తన జ్ఞానానికి తోచిన విధంగా సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాలను విన్న కర్కటి ఆనందపడి, “మీరిద్దరి వివేకం అస్తమించని సూర్యుడిలా ప్రకాశిస్తోంది. మీ సమాధానాలు నా సంశయాలను తొలగించాయి. మీరు గొప్ప జ్ఞానులు” అని అభినందించింది.
అప్పుడు రాజు, “నీ మాటలు వింటుంటే నీవు వివేకవంతురాలివని తెలుస్తోంది. ఇలాంటి నీవు అడవుల్లో ఎందుకు ఉండాలి? మా రాజ్యానికి రా. అక్కడ నీకు ఆశ్రయం కల్పిస్తాను. పాపకార్యాలు చేసే దుర్మార్గులను నీకు ఆహారంగా అందిస్తాను” అని ఆహ్వానించాడు. రాజు మాటలకు సంతోషించిన కర్కటి, అతనితో కలిసి రాజ్యంలోకి వెళ్లి, అవసరమైనప్పుడు హిమాచల శిఖరాలకు వెళ్లి తత్త్వసమాధిలో కాలం గడుపుతూ జీవించింది.
భట్టు వెంకటరావు,
9959120528
