ఉపాధి లేక హమాలీలుగా మారుతున్న యువత

ఉపాధి లేక హమాలీలుగా మారుతున్న యువత

  • డివైఎఫ్ఐ ఆవేదన

మోత్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ యువత హమాలీ కార్మికులుగా, అడ్డమీది కూలీలుగా మారుతున్నారని డివైఎఫ్ఐ (DYFI) జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పాటిమట్ల గ్రామంలో నిర్వహించిన డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా నిరుద్యోగ యువతపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఉపాధి లేక యువత షాపుల్లో గుమస్తాలుగా, హమాలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

రుణాల మంజూరులోనూ నిర్లక్ష్యం..
జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు వ్యక్తిగత అప్పులు చేసి చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకుంటున్నా, ప్రభుత్వం నుండి అందాల్సిన స్వయం ఉపాధి రుణాలు సైతం అందడం లేదని ఆయన ఆరోపించారు. యువతతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసి ఏ గతి పట్టిందో, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కుర్మేటి రాజ్ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply