- పరిసరాలను ఆహ్లాదంగా మార్చుతాం
- కార్పొరేట్ సంస్థలు, స్థానికులు సహకారం అందాలి
- పర్యాటక ఆకర్షణగా చెరువుల అభివృద్ధి
- చెరువుల ఆక్రమణలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు
చెరువుల అభివృద్ధిలో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.
కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అలాగే పరిసర ప్రాంతాల నివాసితుల్లో ఉన్నత వర్గాల వారు కూడా చేయూతనందించాలన్నారు.
నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా అక్కడ పనులు చేపట్టిన ఎన్ఎస్ఎల్ ఇన్‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
అక్కడికక్కడే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి.. చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని సూచించారు.
పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యతను సందర్శించుకునేలా ఈ చెరువు పరిసరాలను అభివృద్ధి చేయాలని.. ఇందుకు పర్యటకాభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యం కావాలని.. పర్యటనలో ఉన్న ఆ సంస్థ ఏజీఎం వరప్రసాద్‌కు కమిషనర్ సూచించారు.
నెక్నాంపూర్లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణలను ఇటీవలే తొలగించామని.. ఇప్పటికే ఈ చెరువును కొన్ని సంస్థలు దత్తత తీసుకున్నాయని.. ఈ పనులు వేగంగా జరగాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు.
దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, ఫిలింనగర్ చెరువుల నుంచి వరద నీరు ఇబ్రహీంబాగ్ చెరువుకు చెరేదని స్థానికులు, అధికారులు తెలిపారు. నివాస ప్రాంతాలు పెరిగిపోవడంతో ఈ చెరువులు, నాళాలు మురుగుతో నిండిపోయాయని స్థానికులు కమిషనర్‌కు చెప్పారు.
మురుగు నీటిని డైవర్ట్ చేసి ఇబ్రహింబాగ్ చెరువును కాపాడలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. మురుగు కంపుతో పాటు.. దోమలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఇబ్రహీంబాగ్ చెరువులోకి మురుగు చేరకుండా.. నాలాలను డైవర్ట్ చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. కాలువల డైవర్షన్‌తో పాటు.. ఎస్‌టీపీలు ఏర్పాటుకు, సుందరీకరణ పనులకు స్థానికుల నుంచి కూడా సహకారం అందాలని కమిషనర్ కోరారు.
చెరువుల ఆక్రమణలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ చెప్పారు. అల్కాపూరి కాలనీ, వెసెల్లా మెడోస్, ఈవీవీ కాలనీ ఇలా చెరువుపై భాగంలో ఉన్న ప్రాంతావారికి ఇబ్రహీం చెరువు ఆహ్లాదాన్నిస్తుందన్నారు.