Twit | భారతీయ ఐక్యతకు నిద‌ర్శ‌నమే ఈ మ‌హా కుంభమేళా – మోడీ

న్యూ ఢిల్లీ – కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. 45 రోజులపాటు జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక వేడుకలో దాదాపు 66 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాకుంభమేళాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు.

భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా నిర్వహించడం అంత సులువు కాదన్నారు. అన్నిటినీ దాటుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమునా, సరస్వతి మాతాలను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఏర్పాట్ల విషయం లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా అందుకు క్షమించాలని ప్రధాని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *