TG | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ…

TG | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ…

  • ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ప్రకటించిన టాస్‌
  • ఇప్పటివరకు మార్క్స్‌ మెవెూలు ఇవ్వలేదని ఆరోపణలు
  • లబోదిబోమంటున్న ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : తెలంగా ణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఫలితాలను వెల్లడించి తర్వాత మార్క్స్‌ మెమోలు ఇచ్చేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షలను గత సెప్టెంబర్‌ 22నుంచి 28వరకు నిర్వహించారు. మొత్తం ఫలితాల సగటు శాతం ఎస్‌ఎస్‌సీ 48.86శాతం, ఇంటర్మీడి యెట్‌ 58.21శాతంగా ఉంది.

ముద్రిత మార్క్స్‌ మెమోలలను 25 రోజుల్లో ఆయా విద్యాసంస్థలకు పంపిణీ చేస్తామని ప్రకటించినా….. ఇంతవరకు పంపిణీ చేయలేదంటున్నారు బాధితులు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 9,717 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఇందులో కేవలం 4,748 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ఇంటర్మీడి యెట్‌ పరీక్షలకు 11,520 మంది హాజరుకాగా, 6,706 మంది ఉత్తీర్ణత సాధించారు.

అయితే రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కు రూ400 ఇంటర్‌కు, ఎస్‌ఎస్‌సీకి రూ.350గా ఫీజు నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఫలితాల్లో ఏవైనా తేడాలుంటే, వాటిని విద్యా సంస్థల హెడ్స్‌ ద్వారా కార్యాలయానికి నవంబర్‌ 14లోగా పంపించాలని సూచించింది. అక్టోబర్‌ 31 తర్వాత వెబ్‌సైట్‌లో ఇంటర్‌, పదికి సంబంధించిన పాస్‌ అయిన సర్టిఫికెట్లు డౌన్‌లోడ్‌ అవుతున్నప్పటికీ సంబంధిత అభ్యర్థులకు ఇప్పటి వరకు వర్జినల్‌ మెమోలు రాకపోవడంతో పలువురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు..

పై చదువులకోసం పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత సంస్థలు వర్జినల్‌ సర్టిఫికెట్లను దాఖలు చేయాలని సూచించడంతో టాస్‌ నిర్వహించిన పది, ఇంటర్‌ పరీక్షల్లో పాస్‌ అయిన అభ్యర్థులు ఇబ్బందులకు గురువుతున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి పది, ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వెంటనే వర్జినల్‌ మెమోలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

Leave a Reply