జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలో మద్యానికి బానిసై…. కన్న తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ మేరకు లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ఈ వివరాలను వెల్లడించారు.
జన్నారం సేవాదాసునగర్ కాలనీకి చెందిన వ్యక్తి జాదవ్ శంకర్ నాయక్ కొడుకు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. తాగుడు కోసం తరచూ డబ్బులు కావాలని తండ్రిని వేధించేవాడు. ఈ నెల 18 న శంకర్ నాయక్ ఇంట్లో రొట్టెలు చేస్తున్న సమయంలో, నూర్సింగ్ నాయక్ కోపంతో రోకలికర్రతో తండ్రి తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. ఈ దాడి కారణంగా శంకర్ నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడి పెద్ద కూతురు భూక్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం నిందితుడు నూర్సింగ్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని లక్షెట్టిపేట కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించడంతో నిందితుడిని జైలుకు పంపినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
ఈ కేసును త్వరగా చేధించిన సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపల్లి అనూష, పోలీసు సిబ్బందిని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.