భక్తుల సేవల్లో రాజీ ఒద్దు….

భక్తుల సేవల్లో రాజీ ఒద్దు….

దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు విస్తృతం.
‘జీరో వేస్ట్ పాలసీ’ అమలు చేయాలి
నెల రోజుల్లో బయోగ్యాస్, పైప్డ్ గ్యాస్ ప్లాంట్లు
హరిత ఆలయాల దిశగా అన్ని దేవాలయాలు..
ఇత నిర్దేశం చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్ లాల్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు అత్యుత్తమ సేవలు అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని దేవాదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. మంగళవారం గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్‌జేసీ, డిప్యూటీ కమిషనర్ కేడర్‌కు చెందిన 22 ప్రధాన దేవాలయాల ఈవోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ భక్తులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను పెద్ద ఎత్తున పెంచాలని ఆదేశించారు. కాలానుగుణంగా కొత్త ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కే . రామచంద్ర మోహన్ మాట్లాడుతూ దేవాలయాలు సమాజానికి భారం కాకుండా సమాజ భారం మోసేలా ఉండాలని పేర్కొన్నారు. ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆలయాల నుంచి చెత్తను డంపింగ్ యార్డులకు తరలించకుండా ‘జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ’ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక ఆలయంలో విజయవంతమైన విధానాలను రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అమలు చేసేలా ‘సక్సెస్ మంత్ర’ విధానాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్ని ఆలయాల్లో రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే సూయేజ్, సల్లేజ్ వాటర్ శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటిని పునర్వినియోగంలోకి తేవాలని సూచించారు. వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే బయోగ్యాస్, గోబర్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, నెల రోజుల్లోగా అన్ని ఆలయాల్లో పైప్డ్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సంప్రదాయేతర విద్యుత్ వనరులను గరిష్టంగా వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. దేవాలయాల్లో ఉచిత సేవలందించే సేవకులను ఆలయాల ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ఆన్‌లైన్ సేవలు, సోషల్ మీడియా ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో విజయవాడ, శ్రీశైలం, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ , సింహాచలం టెంపుల్ , ద్వారకా తిరుమల టెంపుల్ , శ్రీకాళహస్తేశ్వర టెంపుల్ , కాణిపాకం వినాయక టెంపుల్ తదితర ప్రముఖ దేవాలయాల అధికారులు అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు.

Leave a Reply