Puttaparthi | కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం…

Puttaparthi | కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం…

బ్రహ్మోత్సవాలను తలపించిన వేడుకలు…
భారీ ఎత్తున తరలివచ్చిన సాయి భక్తులు
పలువురు మంత్రులు,
ప్రజాప్రతినిధులు

Puttaparthi | పుట్టపర్తి, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీసత్యసాయిబాబా శతజయంతి మహోత్సవాల సందర్భంలో పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి రథోత్సవం (Sathya Sai Rathotsavam) మంగళవారం అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికైంది. స్వామివారి వేదాంత సందేశాలను ప్రతిబింబించేలా, దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలను తలపించేలా, భక్తుల నిండైన హృదయాల్లో పునీత పరవశాన్ని కలిగించేలా ఈ రథోత్సవం ఎంతో వైభవంగా, మరెన్నడూ లేని విధంగా సాగింది.

ఉదయం ప్రారంభం నుంచే పుట్టపర్తి (Puttaparthi) పట్టణం పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి వీధిలోనూ సాయినామ స్మరణలు, వేద పండితుల వేదపఠనల మధ్య కళారూపాల ప్రదర్శనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శతజయంతి ఉత్సవాల ప్రధాన ఆకర్షణగా నిలిచిన రథోత్సవం కోసం వేలాదిమంది భక్తులు తెల్లవారుజామునే ప్రశాంతి నిలయం పరిసరాలకు తరలివచ్చారు.పెద్దవెంకమరాజు కళ్యాణ మండపంవద్ద ఉదయపు తొలి కిరణాలు తాకగా రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నూతనంగా విభిన్న శిల్పకళ తో తయారు చేసిన వెండి రథం భక్తుల చూపును మంత్ర ముగ్దులను చేసింది. రథోత్సవం ప్రారంభమయ్యే క్షణాల్లో వాతావరణం ఒక పవిత్రమైన అనుభూతిని కలిగించింది.

ఈసారి శతజయంతి పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన వెండి రథం, అలంకరణలోనూ, కవళికలోనూ చూసే వారందరినీ ఆశ్చర్యపరిచింది. రథం పైభాగంలో గోపురాకార శిరస్సు, చుట్టూ స్వామివారి జీవన సందేశాలను ప్రతిబింబించే శిల్పాలు, పక్కన గంటల అలంకరణలు రథోత్సవానికి మరింత మహిమాన్వితమైన శోభను చేకూర్చాయి.వెండి ధగధగలతో కాంతులీనుతున్న రథాన్ని ప్రతీ దిశ నుంచి భక్తులు చిత్రీకరిస్తూ, వందనం చేస్తూ, కళ్లార్చకుండా వీక్షించారు. గత రథోత్సవాలతో పోలిస్తే ఈ రథం రూపకల్పన ప్రత్యేకతగా నిలుస్తూ, శతజయంతి స్థాయికి తగ్గట్టుగా సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.

Puttaparthi

ప్రశాంతి నిలయం ఉత్తర గోపుర ద్వారం వద్దకు చేరుకున్న రథంపై స్వామివారి నూతనంగా తయారుచేసిన పసిడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రసంగసంభ్రమమైన క్షణాన్ని కళ్లారా చూడాలన్న ఆశతో భక్తులు (devotees) భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఘంటాలు మోగిస్తూ, వేదఘోషాలతో, శంఖధ్వనులతో పసిడి విగ్రహం రథంపై ఆసీనులైన క్షణం – అనేకమంది భక్తులు తాము ఎన్నెన్నో జన్మలు ఎదురుచూసిన సమయం ఇదే అన్నట్లుగా భావోద్వేగానికి లోనయ్యారు.

రథోత్సవానికి ముందు భాగంలో వేణుగోపాల స్వామి, సీతారామలక్ష్మణసమేతంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను భక్తుల ఊరేగింపుగా నడిపారు. భగవాన్ సత్యసాయిబాబా ధర్మస్వరూపం అన్న సారాన్ని ప్రతిబింబించే ఈ ఊరేగింపులో శతాధిక వేదపండితులు, విద్యార్థులు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. సాయినాములు, భజనల నినాదాలు, వేదమంత్రాలు కలిసిన ఆ పవిత్ర వాతావరణం ప్రతి భక్తునిలో ఆధ్యాత్మిక తేజాన్ని నింపింది. భక్తులు వ్రతాన్ని లాగడం ద్వారా తమ అచంచల భక్తిని స్వామివారికి సమర్పించారు.

Puttaparthi

ఈ రథోత్సవం ప్రత్యేకతల్లో ఒకటి – రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖుల హాజరు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ముఖ్యులు:
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవితమ్మ, సత్యకుమార్ యాదవ్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ముఖ్య సభ్యులు ఆర్.జె.రత్నాకర్, నాగనంద, స్థానిక శాసనసభ్యులు సింధూరరెడ్డి, రక్తం చేసిన శిబిరాలు పరిటాల సునీతమ్మ, మాజీమంత్రిపల్లె రఘునాథ్ రెడ్డి, స్వచ్ఛందకార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్,సినీ నటుడు మురళీమోహన్,బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి. వీరిలో ప్రతీ ఒక్కరూ పసిడి విగ్రహం, వెండి రథం, ఆధ్యాత్మిక కళాప్రదర్శనలను వీక్షించి ప్రశంసించారు. శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సందేశాలను నూతనంగా వెలిబుచ్చేలా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు.

Puttaparthi

ఊరేగింపు ప్రారంభమైన క్షణం నుంచి ముగిసే వరకు కళారూపాలు రథోత్సవాన్ని (Rathotsavam) మరింత తిరునాళ్ల వాతావరణంలోకి తీసుకెళ్లాయి.చెక్కభజన బృందాల ఉత్సాహవంతమైన వాయిద్యాలు, కోలాటాల విన్యాసాలు,చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, కోయడాన్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఈ కళాప్రదర్శనలు భక్తులను అలరించడమే కాకుండా, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే అద్భుత దృశ్యాలను సృష్టించాయి. భక్తులు ఈఊరేగింపులో తామూ భాగస్వాములై ఆనందించేందుకు వీలు కలిగింది.

రథోత్సవాన్ని (Rathotsavam) ప్రత్యక్షంగా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేల సంఖ్యలో చేరుకున్నారు. రథం కదిలిన ప్రతి అడుగు వద్ద భక్తులు “సాయి రామ్… సాయి రామ్…” అంటూ నినదించారు. కొంతమంది వృద్ధులు, శారీరకంగా బలహీనులైనా సేవాదళం సహకారంతో రథాన్ని లాగుతూ తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తపరిచారు.భక్తులు తమ తప్పని సేవగా, తమ జీవితంలో దైవ దర్శనం కోసం ఈ క్షణం ఎంతో ముఖ్యమని భావించి సాయినామస్మరణతో రథోత్సవంలో నిమగ్నమయ్యారు.

భక్తుల భారీ తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో విస్తృతమైన బందోబస్తు చేపట్టారు. పట్టణ డీఎస్పీ ముందుండి, వందలాది పోలీసులు, సేవాదళ స్వచ్ఛందకార్యకర్తలు భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల ప్రవేశం, అత్యవసర వైద్య శిబిరాలు, పర్యవేక్షణ కెమెరాలు అన్నీ సమర్థంగా అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.


సత్యసాయి సేవాదళ సభ్యులు భక్తులకు పానీయాలు, సహాయం, మార్గదర్శనం, వైద్య సహాయం, క్రమపద్ధతిగా రథం దర్శనం నిర్వహణ — అన్నింటిని చక్కగా నిర్వహించారు. యువతుల నుండి వృద్ధుల వరకు సేవాదళంలోని వందలాది సభ్యులు ఈ రథోత్సవం విజయానికి అంతర్గత శక్తిగా నిలిచారు.

ప్రశాంతి నిలయం పరిసర వీధులు పుష్పాలతో అలంకరించబడగా, విద్యార్థులపై శ్రద్ధగా బాబా ఇన్స్పైర్డ్ చేసిన సేవా భావన ప్రతిచోటా కనిపించింది. రోడ్లమీద భారీ రథ దృశ్యం, వెండి కాంతులు, భక్తులఆనందభాష్పాలు – ఇవన్నీ పుట్టపర్తిని మరోసారి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి.శతజయంతి వేడుకలకు ఇది ఆరంభమే… ఈ రథోత్సవంతో శతజయంతి ఉత్సవాలలో ఆధ్యాత్మిక శోభ మరింత విస్తరించింది. రాబోయే రోజుల్లో జరిగే వేదపారాయణాలు, సాంస్కృతిక మహోత్సవాలు, సేవా కార్యక్రమాలు అన్నీ ప్రపంచ భక్తుల దృష్టిని పుట్టపర్తి వైపుకు మరింతగా ఆకర్షించనున్నాయి. భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ రథోత్సవం సత్యసాయి శతజయంతి మహోత్సవాల పర్వదినాల్లో ఒక విశేష ఘట్టంగా చరిత్రలో నిలిచిపోనుంది.

https://www.google.com/search?sca_esv=ef95152108cb68c8&rlz=1C1OKWM_enIN1097IN1099&sxsrf=AE3TifNLPK_wiumK7nu3YmgsfzaLnpYf5Q:1763467213241&q=puttaparthi&source=lnms&fbs=AIIjpHwUoITKcoDBIEpPqu2hIKVM9oCkH2nfJ9woZ8TH61M18cLOaRwSYxZnmBBsDfSnoVVJA46SqjBbtRSqbqzPlZzeU09VeIr91MqABhq7UjWc4MmLGpDA5eXcSlTHP1KEdtnkz2pc6Rnr0nnZqO5P9zzMZNjJMWTXjN85uMza7VHGv9wy46svi9mmHhpJ8DmP4ygdzPoWDwVHIXEogAvdayVrr-DGK1C-TOZQow-YCzwOPOW4j7M&sa=X&ved=2ahUKEwi308Wm0_uQAxUjcGwGHaZaC-QQ0pQJegQICRAB&biw=1366&bih=625&dpr=1

పేద‌ల ఇళ్లపై చేయి వేస్తే.. నా ఇంటిపై వేసినట్టే

Leave a Reply