ప్రజలకు అందించే సేవలపై కలెక్టర్ ఆరా

ప్రజలకు అందించే సేవలపై కలెక్టర్ ఆరా
పెనమలూరు, ఆంధ్రప్రభ : వాహనాల రిజిస్ట్రేషన్ లో ప్రజలకు ఏ విధమైన సేవలు అందుతున్నాయో అని జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ఆరా తీశారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెనమలూరు మండలం కానూరులోని సంతోష్ నెక్స షోరూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ షోరూమ్ యజమానితో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సేవలు అందుతున్నాయి, ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో రవాణా శాఖ కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్ లను ప్రస్తుతం వాహన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆయా వాహనాల షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆ కొత్త సేవల పనితీరు ఎలా ఉంది ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రజల సంతృప్తి స్థాయి ఇంకా మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు ఏమి తీసుకోవాలో షోరూం వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రతి వాహనాల షోరూంలో రిజిస్ట్రేషన్, బీమా, పన్నులు వగైరా చార్జీలు వివరాలను తెలిపే బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావును ఆదేశించారు. తద్వారా ప్రజలు ఏమేమి చార్జీలు ప్రభుత్వం వసూలు చేస్తోంది, తాము ఏమి చెల్లించాలి అనే విషయం పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్టీవో ఎన్.యు.ఎన్.ఎస్. శ్రీనివాసరావు, ఉయ్యూరు ఎంవిఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
