Rayapole | చేప పిల్లలతో మత్స్యకారులకు జీవనాధారం

Rayapole | చేప పిల్లలతో మత్స్యకారులకు జీవనాధారం
Rayapole | రాయపోల్, ఆంధ్రప్రభ : మత్స్యకారుల ఆర్థిక బలోపేతమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని, మత్స్యశాఖ సహకార సంఘాలకు అన్ని విధాలా మద్దతు ఇస్తూ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు.
ఇవాళ రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారీతో కలిసి చెరువులో చేప పిల్లలను విడిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని, వారి జీవన ప్రమాణం మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని మత్స్యకారులకు సూచించారు.
అధికారుల వివరాల ప్రకారం.. అనాజీపూర్ పెద్ద చెరువులో లక్షా 36 వేల చేప పిల్లలను, తిమ్మక్కపల్లి చెరువులో 57 వేల చేప పిల్లలను వదిలారు. మండలంలోని అన్ని చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చేప పిల్లల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు నీల స్వామి, ఉపసర్పంచ్ వేణు, సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
