Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం…

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక ఘట్టం ముగిసింది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ ముగియనుండటంతో, నిందితులందరినీ ఒకే చోట సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఈ విచారణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సిట్ అధికారి, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా స్వయంగా కార్యాలయానికి చేరుకున్నారు.
పెన్ డ్రైవ్ డేటాపై వీడని మౌనం
ఈ కేసులో సిట్ అధికారులు సేకరించిన పెన్ డ్రైవ్ అత్యంత కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో దాదాపు 6 వేల ఫోన్ నంబర్లకు సంబంధించిన ట్యాపింగ్ వివరాలు ఈ పెన్ డ్రైవ్‌లో నిక్షిప్తమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి అధికారులు ప్రశ్నించినప్పటికీ, ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ డేటా గురించి తనకేమీ తెలియదన్నట్లుగా ఆయన వ్యవహరించడం అధికారులకు సవాల్‌గా మారింది. విచారణ అనంతరం భుజంగరావు కూడా చెప్పడానికి ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనార్హం.
ఇక రెండు రోజుల క్రితం ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను సిట్ అధికారులు ముఖాముఖి విచారించారు. ఈ విచారణలో ప్రధానంగా నిధులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు జరిపిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆయన్ను గట్టిగా ప్రశ్నించారు. హవాలా ద్వారా ఏవైనా లావాదేవీలు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఈ కేసులో మరో కీలక పరిణామం ఏమిటంటే.. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను కూడా సిట్ అధికారులు విచారించారు. గతంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ప్రధాన నిందితుడిగా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేల కదలికలను ట్రాక్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్‌ను ఆయుధంగా వాడుకున్నారనే అనుమానంతో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు మధ్య ఉన్న లింకులను ఛేదించడంపై సిట్ దృష్టి పెట్టింది.
