దెబ్బతిన్న ఫోర్డో అణు కేంద్రంలో యుద్ద ప్రాతిపాదికను మరమ్మతు
ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లతో శిధిలాల తొలగింపు
నిర్మాణ పనులను స్పష్టం చేస్తున్న తాజా
శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి పునర్ నిర్మాణ పనులు
తెహ్రాన్ – పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల (air strikes ) నుంచి ఇరాన్ వేగంగా కోలుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తమ అణు కేంద్రంపై బాంబుల వర్షం కురిపించిన వారం తిరగకముందే, దెబ్బతిన్న ఫోర్డో ఇంధన శుద్ధి కర్మాగారం (Fordo nuclear plant ) వద్ద మరమ్మతు (repair) పనులను ముమ్మరం చేసింది. అమెరికా దాడుల తర్వాత, ఇరాన్ (Iran )అణు కేంద్రంలో సెంట్రిఫ్యూజ్‌లు పనిచేయడం ఆగిపోయిందని, కొంత భౌతిక నష్టం జరిగిందని నివేదికలు ఉన్నాయి. అయితే, ఇరాన్ ఈ కేంద్రంలో యురేనియం శుద్ధి చేయడాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఫోర్డో అణు కేంద్రం ఉన్న పర్వత ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అమెరికా దాడులతో ఏర్పడిన శిథిలాలను తొలగించేందుకు ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ముఖ్యంగా, అమెరికాకు చెందిన శక్తివంతమైన జీబీయూ-57 ‘బంకర్ బస్టర్’ బాంబులు లక్ష్యంగా చేసుకున్న సొరంగ మార్గాల వద్ద ఈ పనులు కేంద్రీకృతమయ్యాయి. భూగర్భంలో ఉన్న అణు కేంద్రానికి ఈ మార్గాలు అత్యంత కీలకమైనవి.
ఇంతేకాకుండా, పర్వతంపైకి కొత్తగా యాక్సెస్ రోడ్లను నిర్మిస్తున్న ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడుల వల్ల లోపల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఇరాన్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ మరమ్మతు పనులపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కాగా, గత వారాంతంలో పశ్చిమాసియాలో ఘర్షణలను తీవ్రతరం చేస్తూ అమెరికా.. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అనే మూడు కీలక అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత ఇరాన్ ఇంత వేగంగా స్పందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.