కొన్ని నియోజకవర్గా ల్లో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఈ నిర్ణయం
నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 5(ఆంధ్రప్రభ): నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ లాడ్స్ (నిధుల) విషయంలో అరవింద్ ధర్మపురి నిర్ణయమే ఫైనల్ కానుంది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.70లక్షలు కేటాయిస్తూ వస్తున్నారు. కోవిడ్ కాలం మినహా మిగిలిన అన్ని సమయాల్లో రూ.5కోట్ల నిధులను ప్రతి నియోజకవర్గానికి చేరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలతో ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల ప్రొసీడింగ్స్ పై తన నిర్ణయాన్ని పైనల్ చేయాలని నిర్ణ యానికి వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, స్థానిక అవసరాల నిమిత్తం నిధుల ను కేటాయించే పరిస్థితి ఉండేది.
అయితే స్థానిక నాయకుల సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తూ నియోజక వర్గంలోని కీలకమైన ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తల అభిప్రాయా లను పరిగణలోకి తీసుకొని ముఖ్యమైన పనులకు నిధులు కేటాయిస్తూ, ప్రొసీడింగ్ పత్రాలను ముఖ్య నాయకుల ద్వారా ఇచ్చేవారు. ఈసారి కూడా మొదటగా అలాగే అనుకున్నప్పటికీ , తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో బిజెపిలో నెలకొన్న గ్రూపుల నేపథ్యంలో భవిష్యత్తులో తన ద్వారానే ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం అవుతున్న తరుణంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎంపీ ల్యాడ్ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చు అభివృద్ధి నిధుల విషయం మొత్తం ఎంపీ అర్వింద్ పర్యవేక్షణకు సిద్ధమైనట్టు, అదేవిధం గా తన కార్యాలయ సిబ్బందికి సైతం ఆదేశాలిచ్చినట్టు సమాచారం.