జీజీహెచ్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన

జీజీహెచ్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన

కర్నూలు,ఆంధ్రప్రభ: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం, మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.


ఈ సందర్భంగా డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆసుపత్రిలోని ప్రతి విభాగంలో ఉన్న అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ వైరింగ్‌ను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాలం చెల్లిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను వెంటనే రీఫిల్ చేయించి, ఫైర్ అలారమ్ వ్యవస్థల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.


ప్రమాదం సంభవించిన తొలి ఐదు నిమిషాలు అత్యంత కీలకమని, అగ్నిమాపక దళం వచ్చేలోపు ఆసుపత్రి సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటే భారీ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో వారు ‘ఫస్ట్ రెస్పాండర్స్’గా వ్యవహరించాలని సూచించారు.


జిల్లా అగ్నిమాపక అధికారి జి. బాలరాజు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఎలా వినియోగించాలో సెక్యూరిటీ, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యక్షంగా చూపించి శిక్షణ ఇచ్చామని తెలిపారు.


అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో (ఎవాక్యుయేషన్ ప్రక్రియ) వివరించారు. ముఖ్యంగా ఐసీయూ మరియు వార్డుల్లో పనిచేసే సిబ్బంది పాత్ర కీలకమని చెప్పారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీభాయి, డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓలు డాక్టర్ పద్మజ, డాక్టర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాల, డాక్టర్ కిరణ్, డాక్టర్ సునీల్ ప్రశాంత్, డాక్టర్ క్లింటన్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి భాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply