మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాల నుండి వచ్చిన అందగత్తెలు.. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ఆస్వాదించడానికి పర్యటనలో భాగంగా ఈరోజు బుధవారం చారిత్రాత్మక నగరమైన ఓరుగల్లికి వచ్చారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వరంగల్ చేరుకున్న ఈ సుందరీమణుల బృందానికి హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్ట్‌లో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, నగర పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, పలువురు సీనియర్ అధికారులు, స్థానిక మహిళలు వారికి సాంప్రదాయ పద్ధతిలో మేళతాళాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం హరిత కాకతీయ ప్రాంగణంలో స్థానిక మహిళలతో కలిసి ఈ సుందరీమణులు బతుకమ్మ ఆడారు.
ఆ తర్వాత అందగత్తెల బృందం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి బయలుదేరింది. ఆలయ ప్రాంగణంలో వారందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. టూరిజం గైడ్ లు వారికి ఆలయ విశిష్టత, కాకతీయ నిర్మాణ నైపుణ్యాల గురించి వివరంగా వివరించారు. రామప్ప నిర్మాణ శైలి, శిల్పాలలోని జీవకళను చూసి వారు అబ్బురపోయారు.

తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ నృత్యానికి, ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయ శిల్ప సౌందర్యానికి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తంగా వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందితో ఈ పర్యటనకు భద్రత కల్పించారు.