కడెంలో ఘనంగా మే డే వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంతో పాటు అంబారిపేట్ తదితర గ్రామాల్లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీసీపీ పార్టీ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మే డే జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీసీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు పసుపుల వెంకన్న, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి మాట్లాడుతూ, చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాటాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రమకు తగిన వేతనం, మెరుగైన పని పరిస్థితులు, పని గంటల తగ్గింపు కోసం కార్మిక వర్గం చరిత్రాత్మకంగా పోరాడిందని గుర్తుచేశారు.
1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, ఆ పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి హక్కులు కూడా సరిగా అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, ఎల్పీజీ గ్యాస్ సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఉద్యమాల్లో అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, బీఎస్పీ డివిజన్ నాయకులు జోసఫ్ గంగారం, నాయకులు ఆడేపు గణేష్, మద్దినేని చిన్న రాజన్న, శంకర్, కట్ల వెంకన్న, ఆత్రం మాణిక్‌రావు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మల్లక్క, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
