KCR | తెలంగాణ ద్రోహంపై కేసీఆర్ సమరశంఖం

  • నీళ్లు–నిధులు–నియామకాలతో మళ్లీ ఉద్యమానికి పిలుపు

ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేసీఆర్ తెలంగాణ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని, బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను, చేస్తున్న అన్యాయాన్ని ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని బట్టబయలు చేయాల‌ని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్తామని, భారీ బహిరంగ సభల ద్వారా ఉద్యమాన్ని మళ్లీ నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేసీఆర్ సమరశంఖం పూరించారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి సాగునీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు.

పరిగి, దేవరకొండ , మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సభలు జరగనున్నాయి. సంక్రాంతికి ముందే ఒక సభను నిర్వహించి, పండుగ తర్వాత మిగిలిన రెండు పూర్తి చేయాలా అనే అంశంపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.

‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదంతో మళ్ళీ జనం మధ్యకు వెళ్లాలని, పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి.. ఇప్పటి కాంగ్రెస్ వైఫల్యాలకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ స్వయంగా ఈ సభలకు హాజరుకానుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

మరోవైపు, తెలంగాణ రాజకీయాలు ఈ పరిణామాలతో ఒక్కసారిగా వేడెక్కాయి. కేసీఆర్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చి వరుస మీటింగ్‌లు పెడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply