
అట్టహాసంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
జన కీలాద్రిని తలపిస్తున్న ఇంద్రకీలాద్రి
పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తజన సందోహం
ఉదయం 5 గంటల నుండి కిటకిటలాడుతున్న క్యూ లైన్లు
అమ్మ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం
అడ్డు అదుపు లేని వీఐపీల రాక
చేతులెత్తేసిన ఆలయ అధికారులు
మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నపోలీసులు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : లోకకంటకులైన రాక్షసులను అంతమొందించుటకు ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయనీదేవి కి తాగిన శక్తిని ప్రసాదించి లోకకళ్యాణం కావించడంతో కాత్యాయనీదేవి భక్తులపాలిట కల్పవల్లిగా పేరు పొందింది. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని.. రోగములు, శోకములు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని ప్రతీతి. అటువంటి కాత్యాయనీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారు భక్తులకు సాక్షాత్కరించారు. విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి (Durga Malleswara Swamy) వార్ల దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగవ రోజు కనకదుర్గమ్మ వారు కాత్యాయని రూపంలో అమ్మవారికి దర్శనమిచ్చారు.

కాత్యాయని కరుణించమ్మ కనక వర్షం కురిపించమ్మా అంటూ భక్తులు అమ్మవారి నామస్మరణను జపిస్తూ ఇంద్రకీలాద్రి కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యూ లైన్ లన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయానికి ఉన్న అన్ని మార్గాల ద్వారా భక్తులు తరుముకొంటూ తోసుకొంటూ ముందుకు రావడంతో జనకెలాద్రిని ఇంద్రకీలాద్రి తలపిస్తోంది. మరోవైపు విఐపి ల తాకిడి రోజు రోజుకు పెరుగుతుండడం, అడ్డు అదుపు, వేలపాల సమయంలో లేకుండా తరలి రావడంతో కొండపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. మధ్యాహ్నం 11 గంటల వరకు కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం భక్తుల రాక మరింత పెరగడం అమ్మవారి నివేదనకు అప్పుడప్పుడు దర్శనాన్ని నిలుపుదల చేయడంతో వినాయకుడి గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తండప తండాలుగా తరలివస్తున్న భక్తుల రాకతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఆలయ అధికారులు చేతులెత్తేశారు. పరిస్థితి చేయి దాటి పోతున్న సమయంలో పోలీసులు మొత్తం ఇంద్రకీలాద్రితో పాటు కనకదుర్గ నగర్ ఘాట్ రోడ్డు (Ghat Road) ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని వీఐపీ( VIP)ల రాకను నియంత్రించడంతోపాటు ఘాట్ రోడ్‌లోకి ఎటువంటి వాహనాలను అనుమతించకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఘాట్ రోడ్డు ద్వారా కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చేందుకు ఎగబడి రావడంతో అక్కడ కాస్త ఆందోళనకర పరిస్థితి నెలకొండడం, వారిని నియంత్రించేందుకు పోలీసులు సైతం నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.





