కార్తీక వనసమారాధనలో విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ

    హైదరాబాద్: జంటనగరాలలో ఒకే వారం రెండు ప్రాంతాలలో రెండు వేర్వేరు బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన వేలాది బ్రాహ్మణ వర్గాలలో ఉత్సాహకరంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

    ఒకటి ఆరామద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల సమర్ధవంతమైన సారధ్యంలో కొంపల్లిలో అందమైన వేడుకగా జరుగగా, మరొకటి కూకట్ పల్లిలో దశాబ్దాలుగా సత్యనారాయణస్వామి వ్రతాలు చేయించడంలో అందెవేసిన చెయ్యిగా గుర్తింపు పొందిన బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షుడు ఏ.వి.ఆర్. మూర్తి నిర్వహణలో పుచ్చలపల్లి లీలా సుందరయ్య హాల్లో అట్టహాసంగా జరగడం విశేషం.

    ఒక వేడుకకు ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ ముఖ్య అతిధిగా హాజరవ్వగా, మరొక వేడుకకు ప్రముఖ సినీ యువ కథానాయకుడు రాజ్హా తరుణ్ హాజరై వందలమందిని ఆకట్టుకున్నారు.

    పుచ్చలపల్లి సుందరయ్య వేదికపై ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ, ప్రముఖ సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వర్ధమాన సినీ కథానాయకుడు ఆది సాయి కుమార్ వంటి దిగ్గజాలు హాజరై ప్రసంగించింది ఒక ఎత్తైతే , ఆరామద్రావిడ వేదికపై ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ప్రసంగం ఎంతో ఎంతో ఉత్తేజ భరితంగా, బ్రాహ్మణులు ఆత్మపరిశీలన చేసుకునేలా, ఉత్సాహవంతంగా సాగిందని అక్కడ పాల్గొన్న యావత్తు బ్రాహ్మణ సమాజం ముక్తకంఠంతో పేర్కొని శ్రీనివాస్ కు జేజేలు పలకడం యదార్ధంగా అక్కడ కనిపించిన దృశ్యం.

    పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘ఎదుటివాణ్ణి దెబ్బ తీసేవాడు బ్రాహ్మణుడిగా పనికిరాడు. అసూయతో రగిలిపోయేవాడు బ్రాహ్మణ సమాజంలో ఉండకూడదు. దురదృష్టకరమేమిటంటే డెబ్బై శాతం బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులే ద్వేషంతో, స్వార్ధంతో , అసూయతో ధ్వంసం చేసుకుంటున్నారు. ఇతర కులస్థులు ఎంతో పూజ్యభావంతో చూసే బ్రాహ్మణులు ఉదాత్తంగా ప్రవర్తిస్తున్నారో లేదో ఒకసారి ప్రశాంతంగా ఆత్మ పరిశీలన చేసుకోండి.” అనే సలక్షణమైన ప్రసంగం ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

    ఈ సందర్భంలో పురాణపండ చెప్పిన కంచి కామాక్షికథ, కంచి కామకోటి పీఠం కథ, కంచి పీఠానికి ఉత్తరాధికారిగా అమ్మవారు నియమించుకున్న ఆరామద్రావిడ శాఖకు చెందిన సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి తపోవైభవం విశేషాలు బ్రాహ్మణ సోదరీ సోదరుల మనసులపై చెరగని ముద్రవేశాయనే చెప్పాలి. ఈ సందర్భంలో పురాణపండ ఉపయోగించిన సొగసైన భాషాప్రయోగాలు అక్కడి హృదయాల్ని కట్టి పడేసినట్లు అక్కడి వాతావరణం చప్పట్లతో మారుమ్రోగింది.

    ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ను ఆరామద్రావిడ శాఖ కార్యవర్గ బృందంతో పాటు అధ్యక్షులు వివేక్ కూచిభొట్ల ఘనంగా సత్కరించారు. తరువాయి క్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య వేదికపై ఏ. వి. ఆర్. మూర్తి బ్రాహ్మణ ఐక్య వేదిక సారధ్యంలో నిర్వహించిన వన సమారాధన వేదికపై ప్రముఖ సినీ నిర్మాత , బ్రాహ్మణ సంఘ ప్రముఖులు వివేక్ కూచిభొట్లని, వేదుల సుదర్శన రావును ముఖ్య అతిధి, ప్రముఖ సినీ నటులు సాయికుమార్ ఘనంగా సత్కరించగా… ప్రముఖ పారిశ్రామిక వేత్త , వి .ఎస్.ఎక్సిమాస్ట్ చైర్మన్ వేదుల సుదర్శనరావు, ఎవిఆర్ మూర్తి బ్రాహ్మణ సంఘాలకు చేస్తున్న సేవలను సాయికుమార్ ప్రశంసించారు.

    ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం నాలుగువందల పేజీల ‘శ్రీమాలిక’ ఇరవై ఏడవ ప్రచురణను సాయి కుమార్ ఆవిష్కరించి తొలి ప్రతిని వేదుల సుదర్శనరావు కు, రెండవ ప్రతిని ఆది సాయి కుమార్ కు అందించారు. అక్కడికి విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు స్వయంగా వేదుల సుదర్శనరావు పరమార్ధ దృష్టితో వందలకొలది శ్రీమాలిక ప్రతులను పంచడంతో భారీ స్పందన లభించింది.

    ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు , సీనియర్ పాత్రికేయులు వేదుల సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో కొంపల్లి వన సమారాధనకు హాజరైన రాజ్ తరుణ్ ఆరామద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ సమర్పణలో కార్యవర్గమంతా శ్రమించి ప్రచురించిన ‘యజ్ఞోపవీతం’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సంచికకు వైదిక సంబంధమైన సాహిత్యంతో సహకరించిన పురాణపండ శ్రీనివాస్ ప్రజ్ఞకు కృతజతలు తెలిపారు.

    వందలకొలది బ్రాహ్మణ బంధువులతోపాటు రెండు కార్యవర్గాలను చెందిన ప్రముఖులు వేదుల లక్ష్మీనారాయణ, కొల్లూరు సూర్యారావు, మహేంద్రవాడ మూర్తి , తాతపూడి కీర్తి, ద్విభాషి వెంకట్రావు, ఏ.వి.ఎస్.ఎన్.మూర్తి, చెళ్ళపిళ్ళ సుబ్రహ్మణ్యం, పొదిలి సతీష్, , చెళ్ళపిళ్ళ లక్ష్మి గణనాధా, ఆకొండి నాగేంద్ర, ఆకొండి వెంకట నాగరామ్ , కొల్లూరు సూర్య రావు, అల్లమరాజు శ్రీకాంత్ , అల్లమరాజు రాజ్ కుమార్ , చిలకమర్తి శ్రీరామ శర్మ , అల్లమరాజు సత్య కిరణ్ తదితర కార్యవర్గ బృందం ఐకమత్యంతో ఆద్యంతం సాంస్కృతిక , విందు కార్యక్రమాలను పర్యవేక్షించి అందరి ప్రశంసలు పొందారు.

    తొలుత ప్రముఖ జ్యోతిష గ్రహ విజ్ఞాన పండితురాలు శ్రీమతి కూచిభొట్ల సూర్యకాంతి పవిత్ర పర్యవేక్షణలో సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు చక్కగా జరుగగా, ఈ వనసమారాధనలో ప్రఖ్యాత గజల్ రచయిత, గజల్ శిరోమణి ఆర్.వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ తదితర ప్రముఖులకు ఘానా సత్కారం చేయడం విఙ్ఞతగా పలువురు భావించారు. ఏ.వి ఆర్.మూర్తి బృందం బ్రాహ్మణ ఐక్య వేదికతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కూడా బ్రాహ్మణ సంఘాల్లో ఒక చర్చనీయాంశంగా నిర్వహించడం అభినందనీయంగా పేర్కొన్నారు. ఈ రెండు సమావేశాల్లో ప్రధానంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ ప్రసంగం ఒక సంఘంలో, శ్రీమాలిక బుక్ మరొక సంఘంలో విశేషంగా ఆకట్టుకోవడమే ఈ బ్రాహ్మణ వనసమారాధనలలో హైలైట్ గా పేర్కొంటున్నారు.

    వాదాలకు, వివాదాలకు అతీతంగా ఉండే వివేక్ కూచిభొట్ల వంటి ఉదాత్త సంస్కారం ఉన్న వ్యక్తులని బ్రాహ్మణ సంఘాల కార్యవర్గాలు సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ఉత్తమకార్యాలు బలంగా , ఐకమత్యంగా చెయ్యగలుగుతారని శ్రీనివాస్ చేసిన వివేకవంతమైన ఆలోచనాత్మక వ్యాఖ్య ఒకరకంగా చర్చనీయాంశం అయిందనే చెప్పాలి. అంతేకాదు మరోప్రక్క అప్పటికప్పుడు ఎంతో శ్రద్ధతో వందలకొలది బ్రాహ్మణ ముత్తయిదువులకు , విజ్ఞులకు శ్రీమాలిక వంటి అఖండ గ్రంథ సంపదను వినయభావంతో అందించిన వేదుల సుదర్శనరావు ను పలువురు అభినందించారు.

    Leave a Reply