కాంపల్లి రాజం, సతీష్‌లకు ‘దళిత రత్న’ అవార్డులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మాదిగ హక్కుల దండోర ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న నాయకులు కాంపల్లి రాజం, కాంపల్లి సతీష్‌లకు ‘దళిత రత్న’ అవార్డులు లభించాయి. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ అవార్డులను ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ మేతరి రోజారాణి, ఎంహెచ్‌డీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ కాంపల్లి రాజం, ఎంహెచ్‌డీ టౌన్ ప్రెసిడెంట్ కాంపల్లి సతీష్‌లను ఘనంగా సత్కరించారు.

దళిత హక్కుల పరిరక్షణకు, సమాజ సేవకు చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డులను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమకు ఈ అవార్డు లభించేందుకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా దళితుల హక్కుల కోసం కృషి కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.