పత్రికా స్వేచ్ఛపై ఆరోపణలు..

పత్రికా స్వేచ్ఛపై ఆరోపణలు..
దుర్భాష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిజంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రభలో ప్రచురితమైన ఒక వార్త కథనం నేపథ్యంలో అచ్చంపేటలో జర్నలిస్టుపై దుర్భాషలాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వివరాల ప్రకారం, అచ్చంపేట మున్సిపాలిటీలో పరిపాలనా విధానం, భూమి సంబంధిత వివాదాలపై సోమవారం ప్రచురితమైన కథనం అనంతరం, స్థానికంగా నివసిస్తున్న వ్యక్తి ఫోన్ ద్వారా ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే బెదిరింపులకు దిగినట్టుగా కూడా బాధితులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.
ఈ ఘటనపై అచ్చంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు, పలు మీడియా ప్రతినిధులు కలిసి పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల భద్రతకు భంగం కలిగించే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
