HYDRAA | నాలాలపై ప్రత్యేక అధ్యయనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నగరంలో నాలాల సమస్య గత కొంత కాలంగా ప్రధాన సమస్యగా మారిందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోవడం, రహదారులు జలమయమవడం, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటం ఇందుకు నిదర్శనమని చెప్పారు.

ఈ సమస్యకు ప్రధాన కారణం నాలాలపై జరుగుతున్న ఆక్రమణలేనని అధికారులు గుర్తించారని, దీంతో, హైదరాబాద్‌ నగరంలో నాలాల సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. నాలాలపై జరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు, ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఈ మేరకు నగరంలోని నాలాలపై ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. నాలాల అంశంపైనే రాబోయే నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నట్లు కమిషనర్‌ రంగనాథ్‌ వివరించారు.

ముఖ్యంగా నగరంలో వరద నీరు తరచుగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

నాలాలు, ఇతర నీటి వనరులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వాటిని తక్షణమే తొలగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.

అయితే, పేదలు నివాసం ఉంటున్న నిర్మాణాల విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, ఆ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, దానికి ఉదాహరణగా రసూల్‌పురా నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించినట్లు కమిషనర్‌ రంగనాథ్‌ గుర్తు చేశారు. నగరంలో నాలాల వ్యవస్థను పరిరక్షించి, వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తమ ప్రణాళికలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

Leave a Reply