Final voter list | పార‌ద‌ర్శ‌కంగా తుది ఓటర్ జాబితా రూపొందించాలి

Final voter list | పార‌ద‌ర్శ‌కంగా తుది ఓటర్ జాబితా రూపొందించాలి

  • స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్

Final voter list | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అధికారులు, సిబ్బంది, బి ఎల్ ఓ లతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 16న ఓటర్ల ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. మరణించిన ఓటర్లను విచారణ చేసి జాబితా నుండి తొలగించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం అయినందున, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో బోగస్ ఓటర్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు.

ఉద్దేశ్యపూర్వకంగా, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అనవసర తప్పిదాలకు తావు కల్పిస్తే, సంబంధిత బూత్ లెవెల్ అధికారులను, సూపర్వైజర్లను, ఇతర అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. తుది జాబితా వెలువరించడానికి ముందే సవరించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను ర్యాండమ్ గా చెక్ చేయాలని మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ ని ఆదేశించారు. ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుండి, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ సతీష్, మేనేజర్ ప్రభాకర్, వార్డు ఆఫీసర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply