Distribution | రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ
Distribution | రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ
- టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్
Distribution | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో భూ హక్కులకు భరోసా కల్పిస్తున్నామని, రాజకీయ ఫొటోలు తొలగించి, రీ-సర్వే లోపాలు పరిష్కరించి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. ఇవాళ చిత్తూరు టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థలో విస్తృత సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రీ-సర్వే పూర్తైన 7200 గ్రామాల పరిధిలోని 23 లక్షల మందికి ఈ నెల 9వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ చర్యతో ప్రజలకు తమ భూములపై నమ్మకం, భద్రత కలుగుతుందన్నారు.
గత ప్రభుత్వం ప్రజల ఆస్తులపై రాజకీయ నేతల ఫొటోలను ముద్రించిందని విమర్శించిన ఆయన, ప్రజాభీష్టం మేరకు రాజకీయ ఫొటోలను పూర్తిగా తొలగించి, ప్రజల ఆస్తులపై ఎలాంటి రాజకీయ బొమ్మలు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు రూపొందించామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వమే గానీ, ప్రజల ఆస్తులపై బొమ్మలు వేసుకునే ప్రభుత్వం కాదన్నారు.
రీ-సర్వే 1.0లో జరిగిన తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న ఆయన, ఆ సమస్యలను పరిష్కరించేందుకు 6688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వచ్చిన 2,79,712 అర్జీలను వంద శాతం పరిష్కరించామని తెలిపారు. రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎమ్‌ల సబ్ డివిజన్ ఫీజును కూడా మాఫీ చేశామని చెప్పారు.
రీ-సర్వే 2.0ను రైతులను భాగస్వాములుగా చేసుకుని వివాదాలకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే రెండు దశల్లో 1376 గ్రామాల్లో పూర్తి చేసి మూడో దశ కొనసాగుతోందని, 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని, 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రైవేట్ భూములు, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితుల భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు రెగ్యులరైజేషన్ చేసి, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, 2026లో భూ సమస్యల పరిష్కారంపైనే పూర్తి దృష్టితో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
