Devotional | ఎములాడలో శివ‌రాత్రి సంబురం – రేపు అర్ధ‌రాత్రి రాజన్నకు రుద్రాభిషేకం

ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న మంత్రి పొన్నం
రాత్రి 11 నుంచి 1.30 వ‌ర‌కు స్థానికుల‌కు ద‌ర్శ‌నం
బుధ‌వారం ఉద‌యం నుంచి ద‌ర్శ‌నాలు, మొక్కుబ‌డులు
₹2.03 కోట్లతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు
1800 మంది పోలీసులు, 900 సీసీ కెమెరాలు
మూడు రోజుల పాటు కొనసాగనున్న ప్రత్యేక పూజలు

వేములవాడ, ఆంధ్రప్రభ :
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శివ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మంళవారం ఉదయం 5 గంటలకు లక్ష్మి గణపతిపూజ, ప్రాతఃకాల పూజలు నిర్వ‌హించి శివ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభించారు. రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాత్రి ఏడు గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే రాత్రి ఏడున్న‌ర గంట‌ల‌కు టీటీడీ త‌రుఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు శివార్చన రాత్రి ఎనిమిది గంటల‌కు ప్రారంభించ‌నున్నారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌

మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాలంక‌ర‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా.. ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా మహా జాతర వేడుకలను నిర్వ‌హిస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వ యంత్రాంగం రూ.2.03 కోట్లు మంజూరు చేసింది. సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనాల కోసం ఆలయంలో నాలుగు క్యూలైన్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పుష్క‌రిణి వ‌ద్ద భక్తులకు నీడ కల్పించేందుకు షామియానాలు వేయించారు. ఏర్పాట్ల‌ను జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ జా, ఎస్పీ అఖిల్‌ మహాజను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

15 వైద్యకేంద్రాలు.. 10 సహాయ కేంద్రాలు..

జాతరకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలను అందించనున్నారు. 15 ప్రాథమిక వైద్యచికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిప్పాపూర్‌, జగిత్యాల ప్రయాణ ప్రాంగణాలు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్‌, ఈవో కార్యాలయం, ఆలయ ప్రధానద్వారం, వైద్యశాలలో అత్యవసచికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. 104, 108 వాహనాలతో పాటు రెండు బైక్‌ అంబులెన్స్‌ల‌ను అందుబాటులో ఉంచారు. రాజన్న ఆలయ యంత్రాంగం పది చోట్ల భక్తులకు సహాయకేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వాహనాలు నిలిపేందుకు పలుచోట్ల 12 ఖాళీ స్థలాలను సిద్ధం చేశారు. గుడిచెరువులో 25 ఎకరాల విస్తీర్ణంలో వీఐపీ, సాధారణ భక్తులకు వేర్వేరుగా పార్కింగ్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల బస్టాండ్‌ ప్రాంతంలో, మున్నూరు కాపుసత్రం పక్కన, శాత్రాజుపల్లిరోడ్లులో, వేములవాడ మార్కెట్‌ యార్డు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బైపాస్‌ రోడ్డులో పలు స్థలాల్లో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు రద్దీగా ఉండే 20 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.

1200 ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

వేములవాడలో జ‌ర‌గునున్న శివ‌రాత్రి ఉత్స‌వాల‌కు 1200 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ నిర్ణ‌యించింది. జగిత్యాల బస్‌ స్టాండ్‌ ప్రాంతం, వేములవాడ ప్రధాన బస్టాండ్ల నుంచి ఆర్టీసీ సేవలను అందించనున్నారు. సికింద్రాబాద్‌ బస్టాండ్‌ నుంచి రోజూ ప్రతి పది నిమిషాలకు ఒక్కబస్సు, జాతర ప్రత్యేక బస్సులు, 32 సాధారణ బస్సులను నడిపిస్తారు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, బోధన్‌, కామారెడ్డిల బస్టాండ్ల నుంచి నిర్విరామంగా నడిపించనున్నారు. మరో పదిహేను మినీ బస్సులను పట్టణంలో బస్టాండ్ల నుంచి ఆలయానికి ఉచితంగా నడిపించనున్నారు.

1800 మంది పోలీసులు.. 900 సీసీ కెమెరాలు

ప‌ట్ట‌ణంలోని, అలాగే ఆలయ పరిసరాలు ప్రాంతాల్లో 900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆరుగురు డీఎస్పీల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సుమారు 1800 మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. జాతరలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులను అవసరం బట్టి వినియోగించుకున్నారు. క్యూలైన్లల్లో తొక్కిసలాట జరుగకుండా చర్యల కోసం సిబ్బందిని కేటాయించారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఇంటలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచి, ఐడీ పార్టీ పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించనున్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు, మూడు మొబైల్‌ వాహనాలను అందుబాటులో ఉంచారు.

మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల నుంచి…

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధ‌వారం భక్తులకు స్వామి వారి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల నుండి అర్ధ‌రాత్రి 1-30 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు దాతలు, స్థానిక అధికారులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఉంటుంది. తెల్ల‌వారు జామున 3.30 గంటల నుండి 3.40 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు. 3.40 గంటల నుండి 4.20 గంటల వరకు వరకు సుప్రభాత సేవ ఉంటుంది. ఉదయం 4.30 గంటల నుండి 6 గంటల వరకు ప్రాత:కాల పూజ అనువంశిక అర్చకుల దర్శనం. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాధార‌ణ ద‌ర్శ‌నాలు, మొక్కుబ‌డులు ఉంటాయి. సాయంత్రం 6.05 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ కాలమందు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *