ఓం నమశ్శివాయ, ఓం పాప వినాశనాయ, పంచాక్షరి నామాయ, ఓం సర్వభూతనాయక ఓం విశ్వశాంతి కారక నమో నమ: అంటూ మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి పరమానందంగా పూజిస్తుంటాము అభిషేకాలు చేస్తూ జాగారణలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ కీర్తనలు పాడుతూ వేల దీపాలతో ఆ దేవదేవుని ఆరాధించరస్తూనే ఉంటాము. అయితే అలా ఒకరోజు చేయగానే, చేసిన పాపాలు పోతాయా! ఊరికే ఒక రోజుకే పుణ్యాలు వస్తాయా! అంటే అది ఆలోచించవలసిన విషయం. శోధించవలసిన విషయం.
శివరాత్రి నాడు పూజలు చేయడ కన్నా, జాగారణ చేయడం ఉపవాసాలు చేయడం కన్నా నీవు ఎప్పుడైనా ఎవరికైనా పట్టెడు అన్నం పెట్టినది. ఆర్తులకు చిన్ని సాయం చేసినది. నీకున్న దానిలో ఎంతో కొంత ఇతరులకు సాయం చేసినది మిన్న అవుతుంది
దేవుళ్లను పూజించడం కన్నా అసలు దేవుళ్ళు అయిన తల్లిదండ్రులను పెద్దలను గురువులను గౌరవించడం, వారికి ఓ ముద్ద పెట్టడం ఓ ముద్దు ముచ్చట తీర్చడం చేసినట్లయితే అది ఎంతో పుణ్యదాయకం.
ఒక్కరోజు, ఒక్క శివరాత్రి రోజు నీవు జాగరణ ఉపవాస దీక్షలు, పూజలు చేస్తే పుణ్యమేల వచ్చును,పాపాలేల పోవును.
గుడిలో దీపాలు వెలిగించి, హారతులు ఇచ్చినంత మాత్రాన నీ భక్తి పరిపూర్ణత చెందదు. విగ్రహాలకు నిగ్రహాలు లేక జ్యోతులు వెలిగించడం కాదు. నీలో ఒక్క ఆత్మ జ్యోతి వెలిగించుకో, ఆ వెలుగులో నీకు ఆత్మ, పరమాత్మ జీవిత పరమార్ధం రెండూ తెలుస్తాయి.
గుడులు గోపురాలు నదీనదాలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు చుట్టూ తిరగడం కన్నా, నీ చుట్టూ నీవు తిరిగితే, నిత్య సత్యాలు తెలుస్తాయి. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే, నిజానికి దేవుడు ఒక నమ్మకం. సేవ చేయడం యదార్థం.
ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవాలంటే, నేను అనే అహాన్ని తొలగించు, నేనెవరు నీవెవరు అని పరిశీలించు, అప్పుడే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని తెలుసుకోగలవు.
ఇక నీ చుట్టూరా ఉన్న ప్రపంచం అంతా శివమయం అనుకున్నప్పుడు, శుభకరం అనుకున్నప్పుడు మంగళకరం అనుకున్నప్పుడు, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకున్నప్పుడు, అప్పుడు నీవే శివుడు,శివుడే నీవు.నీ మనసు కుఆనందమే కాదు, మహానందం, పరమానందం కలుగుతుంది. ఎలాంటి అలజడులు నీ మనసులోకి రానే రావు, ప్రశాంత జీవితానికి ఆధ్యాత్మికత పునాది అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనము పురాణాలలోని పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తాము ,కానీ వాటిలోని పరమార్ధాన్ని వదిలి వేస్తున్నాము, నిజమా కాదా!
శివరాత్రి వేదికగా అసలు శివతత్వాన్ని తెలుసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. వెండి కొండ, ఆహ్లాదకరమైన కైలాసము, మంది మార్బలము, తోడుగా మహాశక్తి స్వరూపిణి పార్వతి ఇందరుండగా,ఎలాంటి ఆర్భాటము లేకుండా, నిరాడంబరంగా, నిర్మలంగా ఒంటికి బూడిద పూసుకొని స్మశానములో తిరుగుతూ ఉంటాడు శివుడు. అంటే చివరకు మిగిలేది ఎన్ని సంపదలు ఉన్నా ఆ బూడిదే అని, చివరికి చేరవలసిన స్థలము స్మశానమేనని అతను తెలియజేస్తున్నాడు, తనకు కైలాసగిరి కన్నా స్మశానం లోనే ప్రశాంతత ఉన్నదని, అనగా అంతిమ జీవితం,అంతిమ పరమార్థం జీవన్ముక్తి అని, మృత్యువును చేరుకోవడం అని, ఎంత సంపద ఉన్నా చివరికి నీవు కాటికి చేరవలసిందేగాని, మరొకటి లేదని తెలియజేస్తున్నాడు.
జీవుడు వ్యష్టి (వ్యక్తి), దేవుడు సమిష్టి (సమాజం) వ్యక్తి పవిత్రంగా ఉంటే, ఆనందంగా ఉంటే సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. కనుక వ్యక్తి అహం వీడి, స్వార్థం వీడి, తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతికిస్తూ ఉంటే, సమాజం కూడా ప్రగతి పథంలో వికసిస్తుంది.
మనిషి జీవితం ప్రశాంతంగా మనుగడ సాగాలంటే, ముఖ్యంగా మనిషిలో రెండు కారాలను తగ్గించుకోవాలి, ఒకటి అ#హంకారం, రెండు మమకారం, ఈ రెండూ తగ్గినప్పుడు ఎలాంటి సమస్య రాదు. వచ్చినా, మౌనంగా దానికదే అనుకోకుండా పరిష్కరించబడుతుంది, ముందు నీవు మారు, నిన్ను నీవు సంస్కరించుకో, అప్పుడు ప్రపంచాన్ని గురించి ఆలోచించు. శాంతికి అశాంతికి, సుఖానికి దు:ఖానికి, స్వర్గానికి నరకానికి, మంచికి చెడుకి, ఆశకు నిరాశకి, ధైర్యానికి భయానికి, అన్నిటికీ మూలము మనసు. కాబట్టి మనసును అదుపులో పెట్టుకోగలిగితే, దానికి మించిన ధ్యానం, యోగం భక్తి, ముక్తి మరేదీ లేదు. కనుక మనసుని తృప్తి పరుచుకుంటే, జీవితమంతా సంతృప్తితో హాయిగా బ్రతకవచ్చు.
అందుకే మన వేదాలలో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మఅంటే జ్ఞానమే బ్రహ్మ, నిన్ను నువ్వు తెలుసుకోవడమే ప్రపంచం, నిన్ను నువ్వు తెలుసుకోవడమే దేవుడు, రెండవది తత్వ మసిలిఅంటే అది నీవే, నీలోనే అన్నీ ఉన్నాయి, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే వేదతత్వం. మరొక వాక్యం అహం బ్రహ్మాస్మిఅంటే నేనే బ్రహ్మని, నేనే అణువును, నేనే పరమాణువును, నేనే బ్రహ్మాండాన్ని నేనే సూక్ష్మాన్ని, నేనే స్థూలాన్ని, అప్పుడు ఆత్మ జీవాత్మ ఒకటేనని తెలుస్తుంది. అలాగే మరొక వాక్యం త్వమే వాహం అంటే నీవే నేను, నేనే నీవు, ఇది తెలుసుకున్న తర్వాత మరొక వాక్యం అయ మాత్మ బ్రహ్మఅంటే సకల జీవులలో ఉన్న ఆత్మనినేనే అన్ని జీవులలోనున్న పరమాత్మని నేనే అని అందుకు నేనే సాక్షి అని తెలుసుకోగలుగుతావు. వీటిని తెలుసుకున్న వాడే జ్ఞాని, మహాజ్ఞాని, ముని, మహాముని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:
- రాఘవ మాస్టారు కేదారి
అధ్యక్షులు
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి