Collector | గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Collector | గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Collector | అచ్చంపేట,ఆంధ్రప్రభః అచ్చంపేట మండల పరిధిలోని ఐనోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రతపై సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కిచెన్‌ షెడ్‌, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సామగ్రిని తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మెనూ ప్రకారం వంటలు చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా బాలికలను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా విద్యావంతురాలిగా ఎదగాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని విద్యార్థినులకు సూచించారు. తరగతి గదిలో గణిత, ఆంగ్ల విషయాల్లో విద్యార్థుల సామర్థ్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Leave a Reply