Vemulawada | రాజన్న క్షేత్రంలో చతుర్వేద స్మార్త పరీక్షలు

  • వేములవాడలో జరపడం గొప్ప గౌరవం
  • నాలుగు వేదాలు చదివే పాఠశాల ఇక్కడే
  • సంతోషం వ్య‌క్తం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


వేములవాడ, ఆంధ్రప్రభ : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహించడం గర్వంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. దేశ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు వేములవాడ (Vemulawada) లో ఏర్పాటు చేశారు. విద్వత్ సదస్సులో భాగంగా వేద పండితులకు చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామితో కలిసి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్త వేద పండిత విద్యార్థులు హాజరయ్యే పరీక్షలు వేములవాడలో జరపడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అన్నారు. నాలుగు వేదాలు చదివే పాఠశాల ఒక్క వేములవాడలోనే ఉందని, వేద పండితులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదివరకు తిరుమల తిరుపతిలో జ‌రిగే పరీక్షలు ఇప్పుడు రాజన్న సన్నిధిలో నిర్వహించి వారికి పట్టాలు పంపిణీ చేయడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply