Celebrations | కోర్టు కల సాకారం

Celebrations | కోర్టు కల సాకారం
- మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో సంబురాలు
Celebrations | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు కావడంతో మక్తల్ ప్రాంత ప్రజల కల సాకారమైందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. కోర్టు ఏర్పాటు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాతీయ జెండాలను చేతబట్టి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
మంత్రి నివాసం నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి 167వ జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కోర్టు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు.

కర్ణాటక సరిహద్దున ఉన్న మండలంలో చివరి గ్రామాలు నారాయణపేట కోర్టుకు వెళ్లేందుకు 75 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదన్నారు. దీంతో చాలా వ్యయ ప్రయాసలకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంతంలో కోర్టు ఏర్పాటు కావాలని చాలా కాలంగా కోరుతున్నప్పటికీ కోర్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయిందన్నారు.
ఎట్టకేలకు జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయం ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరిందన్నారు. కోర్టు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి. లక్ష్మారెడ్డి, కట్ట సురేష్ కుమార్ ,బి. గణేష్ కుమార్, బోయ రవికుమార్, కోళ్ళ వెంకటేష్, కావాలి తాయప్ప , నూరుద్దీన్ , తదిగోవర్థన్ ,గాయత్రి అనిల్ కుమార్, ఉసామోద్దీన్ తరులు పాల్గొన్నారు .
