హైదరాబాద్ : జనాభా లెక్కలతోపాటు కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర కేబినెట్‌కు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు
కేంద్ర నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందన్నారు.రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే. రాహుల్ విజన్ తో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాడింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనూ ఆందోళన చేశారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైంది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
మరోవైపు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్రం దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి దేశానికి దుక్సూచిగా మారిందన్నారు. కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని పొన్నం తెలిపారు.
కుల గణన కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతోపాటు కులగణన నిర్వహిస్తామనడం హర్షించదగిన విషయమన్నారు. రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టామన్నారు. కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో కులగణనకు ఒప్పుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.