TTD | ఉద్యోగ సంఘాల నిరసనకు తెర…
- టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణ చెప్పిన బోర్డు సభ్యుడు నరేష్
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌కు క్షమాపణలు చెప్పాడు. క్షణికావేశంలో తప్పు చేశానని, కలసికట్టుగా మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. బాలాజీ పట్ల తాను బాధ్యత రహితంగా వ్యవహరించానని నరేష్ కుమార్ పశ్చాత్తాప పడ్డారు.
‘‘భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. క్షణికావేశంలో చేసిన తప్పు…. ఆయన కుటుంబ సభ్యులు సైతం పశ్చాత్తాప పడ్డారు. సంస్థ ప్రతిష్ట కాపాడే విధంగా అందరూ కృషి చేస్తాం’’ అని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
అసలేం జరిగిందంటే..
రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్… వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని… మహాద్వారం దగ్గరకు వచ్చారు. అయితే మహాద్వారం వద్ద ఉన్న బాలాజీ అనే ఉద్యోగి గేటు తీసేందుకు అంగీకరించలేదు. దీంతో బోర్డు సభ్యుడు అగ్రహంతో ఊగిపోయాడు. గేటు తాళం తీయని బాలాజీ అనే ఉద్యోగిని దూషించాడు.
వెంటనే అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సురేంద్ర, పోటు ఏఈవో మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపించారు.
అయితే, టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్‌కి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్‌ను తక్షణం తొలగించాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర టీటీడీ ఉద్యోగిని తిట్టిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.