Algae tree | కాలుష్యానికి చెక్ పెట్టే ఆల్గే ట్రీ

Algae tree | కాలుష్యానికి చెక్ పెట్టే ఆల్గే ట్రీ
Algae tree | కాలుష్య సమస్యకు కొత్త పరిష్కారం – ఆల్గే ట్రీ
సౌరశక్తితో పనిచేసే స్మార్ట్ పరికరం
లాభాలు: పర్యావరణానికి భారీ ప్రయోజనం
నష్టాలు: పరిమితులు, సవాళ్లు
చెట్లకు ప్రత్యామ్నాయం కాదు – నిపుణుల హెచ్చరిక
Algae tree | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పర్యావరణ పరిరక్షణలో సరికొత్త విప్లవం మొదలైంది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దేశంలోనే మొట్టమొదటి ‘ఆల్గే ట్రీ’ ని ప్రారంభించారు. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను కృత్రిమంగా నిర్వహిస్తూ, గాలిని శుద్ధి చేసే ఈ పరికరం చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. అయితే దీని వల్ల లాభాలతో పాటు నష్టాల కూడా చాలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు..

పెరుగుతున్న పట్టణీకరణ వల్ల చెట్లు తగ్గిపోయి గాలి కలుషితం కావడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి ఆల్గే ట్రీ అందుబాటులోకి వచ్చింది. ఇది సాంకేతికతను పర్యావరణంతో కలిపి తయారు చేసిన ఒక అద్భుతమైన పరికరం. భారతదేశపు మొట్టమొదటి ఆల్గే ట్రీని భోపాల్‌లోని స్వామి వివేకానంద పార్కులో ఏర్పాటు చేశారు. 2026 మే 1న క్యాబినెట్ మంత్రి విశ్వాస్ సారంగ్ చేత ప్రారంభించబడిన ఈ వినూత్న సౌరశక్తితో పనిచేసే పరికరం, పట్టణ ప్రాంతాల్లోని పర్యావరణ సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
50 మందికి పైగా నిపుణుల బృందం రెండు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసిన తర్వాత మష్రూమ్ వరల్డ్ గ్రూప్ సంస్థ ద్వారా అభివృద్ధి చేసిందే “ఆల్గే ట్రీ”. ఇది ఒక సాంప్రదాయ చెట్టు కాదు.. గాలిని శుద్ధి చేయడానికి ఉపయోగించే ఒక స్మార్ట్ పరికరం.
కార్బన్ డయాక్సైడ్ పిల్చి ఆక్సిజన్ విడుదల..
ఇది ఒక కృత్రిమ పరికరం అయినప్పటికీ, మొక్కలలాగే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ పరికరంలోని ఆల్గే (పాచి వంటి జీవులు) గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని, ప్రతిగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఒకే ఒక్క ఆల్గే ట్రీ దాదాపు 25 సాధారణ చెట్లు గ్రహించే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలదని, అలాగే ఈ పరికరం ఏడాదికి సుమారు 1.5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, దాదాపు 1 టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సౌరశక్తితో పనిచేస్తూ..
ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేయడంతో ఎలాంటి విద్యుత్ ఖర్చు అవసరం లేదు. రద్దీగా ఉండే రహదారులు, బహిరంగ ప్రదేశాలలో చెట్లను నాటడం కష్టంగా ఉండే ప్రాంతాల కోసం దీనిని రూపొందించారు. నగరాలను మరింత పచ్చగా మార్చడంలో ఇది ముఖ్యమైన ముందడుగు. ఈ పరికరం ఇప్పటికే ఉన్న చెట్లను తొలగించడానికి బదులుగా వాటికి తోడుగా ఉండేలా రూపొందించబడింది. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా భారతదేశంలోని ఇతర నగరాలలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఆల్గే ట్రీ లాభాలు..
- అధిక సామర్థ్యం, తక్కువ స్థలంలోనే 25 చెట్ల పనిని ఇది ఒక్కటే చేయగలదు.
- స్థల అభావం వల్ల చెట్లు నాటడానికి వీలులేని రద్దీ నగరాల్లో కాలుష్యాన్ని అదుపు చేయడానికి ఇది ఉత్తమ పరిష్కారం.
- దీనిపై సోలార్ ప్యానెల్ ఉండటంతో ఇది సహజమైన ఎండతోనే పనిచేస్తుంది.
- చుట్టుపక్కల ఉండే గాలిని వేగంగా శుద్ధి చేసి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది.
ఆల్గే ట్రీతో నష్టాలు..
- సాధారణ చెట్లకు పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఈ పరికరంలోని ఆల్గేను క్రమం తప్పకుండా మార్చడం , యంత్రాన్ని శుభ్రం చేయడం వంటి వాటికి నిర్వహణ ఖర్చు అవుతుంది.
- ప్రకృతి సిద్ధమైన చెట్లు పక్షులకు, కీటకాలకు ఆవాసాన్ని , నీడను ఇస్తాయి. ఈ కృత్రిమ ఆల్గే ట్రీ కేవలం గాలిని మాత్రమే శుద్ధి చేస్తుంది తప్ప ఇతర జీవులకు ఆశ్రయం కల్పించదు.
– ఇది తన చుట్టూ ఉన్న పరిమిత ప్రాంతంలోనే గాలిని శుద్ధి చేయగలదు. భారీ స్థాయిలో కాలుష్యాన్ని తగ్గించాలంటే చాలా యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
పర్యావరణాన్ని రక్షించడానికి టెక్నాలజీని వాడుకోవడం గొప్ప పరిణామం. కానీ దీన్ని చెట్లకు మద్దతుగా వాడాలి తప్ప, చెట్లకు బదులుగా వాడకూడదు. ఈ పరికరం చెట్లకంటే వేగంగా పనిచేసినా.. చెట్లు ఇచ్చే నీడను, పక్షులకు గూడును మాత్రం ఇవ్వలేవు. అయితే ఆల్గే ట్రీలు వచ్చాయికదా అని చెట్లను పెంచడం మానేస్తే అది మానవాళి ముప్పుకు దారి తీస్తుంది.

