TG | రేపు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు.
పోలేపల్లి లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణ పేట మండలం అప్పక్ పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలచే నడిపే పెట్రోల్ బంక్ ఇది.
రాష్ట్రంలోనే మొదటి సారి ఈ తరహా బంక్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నారాయణపేట మెడికల్ కాలేజీ లో అకడమిక్ బ్లాక్ తో పాటు-, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు-చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.