వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..

వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..

అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వవద్దు
అనుమానస్పద వ్యక్తుల కదలికలపై 100కు సమాచారమివ్వాలి
శివసాయినగర్‌లో పోలీసుల కార్టన్‌ సెర్చ్‌
ఆధీనంలోకి ఒక కారు, 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో
అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు


అచ్చంపేట, నవంబర్‌ 5, (ఆంధ్రప్రభ) : అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి కదలికలపట్ల అనుమానం వస్తే వెంటనే 100 నెంబర్‌ ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని అచ్చంపేట డిఎస్పీ (Achampet DSP) పల్లె శ్రీనివాసులు కోరారు. బుధవారం నాడు ఉదయం డిఎస్పీ పల్లె శ్రీనివాసులు నేతృత్వంలో, సిఐ నాగరాజు, ఎస్సై సద్దాం హుస్సేన్‌ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని శివసాయి నగర్‌లో కార్టెన్‌ సెర్చ్‌ (కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రొగ్రాం)ను నిర్వహించి పత్రాలు లేని ఒక కారు, 60 ద్విఛక్ర వాహనాలు, ఒక టాటా ఏస్‌ బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈసందర్భంగా డీఎస్పీ పల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ… నేర నియంత్రణలో భాగంగా కార్డెన్‌ సెర్చ్ (Cordon Search) నిర్వహించామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల ఒక కన్నేసి వుండాలని, అలాంటి వారి కదలికలపై అనుమానం వచ్చినట్లయితే 100 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారమివ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా వుండడం వల్ల నిరభ్యంతరంగా సమాచారమివవ్వచ్చని కాలనీ వాసులకు భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు. అపరిచితులకు అద్దెకు ఇల్లు ఇవ్వరాదని తెలిపారు.

జప్తు చేయబడ్డ వాహన యజమానులు (Vehicle owners) సరైన పత్రాలు పోలీసు స్టేషన్‌లో సమర్పించి తమ వాహనాలు తీసుకెళ్లాలని, లేని యెడల చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిఐ నాగరాజు మాట్లాడుతూ… కాలనీలలో సిసి కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఆధునిక సాంకేతికతో కూడిన తాళాలు మార్కెట్‌లో లభిస్తున్నాయని, అట్టి తాళాలను ఇంటికి బిగించుకోవాలని, ఇంటికి తాళం వేసి ప్రయాణాలకు వెళ్లే వారు పోలీసు వారికి సమాచారమిచ్చినట్లయితే ఆ ఇంటిపై పోలీసు వారు నిఘా పెట్టే అవకాశముందని, ప్రెండ్లీ పోలీస్‌ వారి సేవలను ఉపయోగించుకుంటూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఇట్టి కార్టెన్‌ సెర్చ్‌లో ఎస్సైలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply