కిమ్స్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్..

కిమ్స్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ.
మిమ్మల్ని చంపేద్దాం అన్నది వాళ్ల ఉద్దేశం కాదు కానీ.. మీ డబ్బులు తీయాలి అన్నది మాత్రం వాళ్ల లక్ష్యం – ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇప్పుడు వాస్తవ రూపంలో కర్నూలు కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో పునరావృతమైంది. ఎనిమిదేళ్ల చిన్నవాడి ప్రాణాలతో ఆటలాడిన ఆసుపత్రి యాజమాన్యం, చివరకు ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడలేకపోవడం కాదు, కాపాడే ప్రయత్నం చేయకపోవడమే చర్చనీయాంశంగా మారింది.

ఆరు రోజులు ట్రీట్మెంట్… లక్షల్లో బిల్..
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న రోషన్ (8ఏళ్లు), తన తల్లిదండ్రులు నమ్మిన డాక్టర్ల చేతిలో చికిత్స కోసం కిమ్స్ ప్రైవేట్ హాస్పిటల్‌కు చేరాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిని ఆశ్రయించడం, డాక్టర్ల పై నమ్మకం చూపించడం, ఎమోషనల్‌గా చికిత్స కోరడం.. అన్నీ ఆరు రోజుల పాటు కొనసాగాయి కానీ.. ఆ సమయంలో యాజమాన్యం ఆసక్తి చికిత్సలో కాకుండా బిల్లులలోనే కనిపించింది. గంట గంటకూ చార్జీల గేమ్.. మొట్టమొదట్లో అత్యవసర చికిత్స పేరిట అడ్వాన్స్ బిల్లు తీసుకుని, ఆ పై ఇది కావాలి… అది కావాలి అంటూ మొత్తం బిల్లు 6.50 లక్షలకి చేరింది.

ఆరోగ్య శ్రీలో రీ అడ్మిషన్.. అదే రోజు మృతి..
సినిమా క్లైమాక్స్‌కు తగ్గ ట్విస్ట్ గడచిన రోజే చోటుచేసుకుంది. చివరి రోజున ఆరోగ్యశ్రీ పథకం కింద రీ అడ్మిషన్ చేశారు కానీ.. అదే రోజు చిన్నారి ప్రాణాలు పోయాయి. ఇప్పటి వరకూ ‘కాష్ పేషెంట్’గా బిల్లులు వేసి, చివర్లో ఆరోగ్యశ్రీ పేరుతో పత్రాల నాటకం ఆడిన ఆసుపత్రి యాజమాన్యం పట్ల తల్లిదండ్రులు, బంధువులలో ఆవేదన చెలరేగింది. మా బిడ్డను డబ్బుల కోసం వాడేశారు. చివరకు రక్షించలేకపోయారు. మనసు ఉన్నంత వరకు అడగండి.. డబ్బులు లేకపోతే చావండి.. ఇదేనా వైద్యుల దారుణమైన వైఖరి? అని మృతుడి తండ్రి ఏడుస్తున్నారు.

ఠాగూర్ తరహాలో ప్రజలు గళమెత్తాలి..
ఠాగూర్ సినిమాలో విద్య, వైద్యం, రవాణా రంగాల్లో ఉన్న అవినీతిని బహిర్గతం చేసి న్యాయం చేసినట్టు.. కిమ్స్ ఘటన తరువాత కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. వైద్య ఆచారాలకు విరుద్ధంగా, లాభం కోసం ప్రాణాలు దక్కించుకోవడం అనే కోణంలో ఆసుపత్రులు నడవకూడదు. అంతా డబ్బుల మీదే అన్నారు.

ఇంకెంత మంది రోషన్లు..?
మరో రోషన్ ను కోల్పోకుండా, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని అక్రమాలు, అధిక ఛార్జీలు, ఆరోగ్యశ్రీ నిబంధనల దుర్వినియోగం పై ప్రభుత్వాలు, సమాజం సీరియస్‌గా స్పందించాలి. ఈ విషాద ఘటన చివరి ఘడియగా మారాలని ఆశిద్దాం. పరిశోధన కావాలి.. బాధ్యుల పై చర్యలు తప్పనిసరి తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు.. సమాజం మారాలంటే.. మనమే మారాలి. అప్రజాస్వామ్య మార్గాల్లో నడిచేవారిని ప్రశ్నించాలి. లేకపోతే… మరి కొంతమంది రోషన్లను కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

Leave a Reply