సెప్టెంబర్ తొలి వారంలోనే గోదావరి పుష్కర పనులు ప్రారంభించాలి
ఆగస్టు చివరి నాటికి టెండర్లు పూర్తి చేయాలి.. నాణ్యతలో రాజీ వద్దు: మంత్రి శ్రీధర్‌బాబు
మంథని, ఆంధ్రప్రభ: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన ‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్–1 ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, అయితే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, రోజువారీ పురోగతిని తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమన్నారు. భక్తుల రవాణాకు అంతరాయం లేకుండా ప్రతి రహదారిని అనుసంధానించాలని, ఎక్కడైనా రహదారి అనుసంధానం లోపిస్తే వెంటనే గుర్తించి స్థానిక నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను ఏర్పాట్లలో భాగస్వాములను చేయాలని, భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలను ముందుగానే గుర్తించాలని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని, పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
