HYDRAA | హైకోర్టు ఆదేశాలతో పార్కుకు రక్షణ..
- హైడ్రా చర్యలపై అర్జున్‌రెడ్డి కాలనీ వాసుల హర్షం
- చందానగర్‌లో పార్కు స్థలానికి ఫెన్సింగ్.. ఆక్రమణలకు అడ్డుకట్ట
చందానగర్, ఆంధ్రప్రభ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని అర్జున్‌రెడ్డి కాలనీలో పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్కు స్థలం చుట్టూ గురువారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పార్కు స్థలంగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
చందానగర్ సర్వే నంబర్ 123లో 3.24 ఎకరాల విస్తీర్ణంలో 41 ప్లాట్లతో 1995లో హుడా అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో 400 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే కొంతకాలంగా ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరగడంతో కాలనీ నివాసితులు వాటిని అడ్డుకుంటూ వచ్చారు.
పార్కు స్థలం తమదేనంటూ కొందరు ఆక్రమణకు ప్రయత్నించడంతో కాలనీవాసులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పార్కు స్థలంతో పాటు అంతర్గత రహదారులను పరిరక్షించాలని జీహెచ్‌ఎంసీకి సూచిస్తూ 2022లో హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆక్రమణ ప్రయత్నాలు కొనసాగాయి. పలుమార్లు జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అర్జున్‌రెడ్డి కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.
హైడ్రా చర్యలపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభించిందని, పార్కు స్థలాన్ని కాపాడుకోగలిగామని వారు తెలిపారు.
