బాబోయ్‌.. ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె!

  • ఢిల్లీలోని విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన.. ప్రయాణికుడిపై కేసు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీల్లో భాగంగా ప్రయాణికుల బ్యాగులను పరిశీలిస్తుండగా.. ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో భద్రతా సిబ్బంది బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా అందులో పుర్రె కనిపించింది. దీంతో అధికారులు తీవ్రంగా ఆశ్చర్యపోయారు.

దీనిపై ప్రయాణికుడిని ప్రశ్నించగా.. అది కోతి పుర్రె అని అతడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.. తదుపరి చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పుర్రెను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దానిని ఎందుకు తరలిస్తున్నాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.