గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పల్లె బాట

  • విద్యుత్ శాఖ ఏఈ నర్సిరెడ్డికి సమస్యలు వివరించిన గ్రామస్తులు

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె బాట కార్యక్రమం రామచంద్రపురం గ్రామంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ నర్సిరెడ్డి పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్‌ వై. నర్సిములు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా వీధి దీపాలకు అవసరమైన మూడో వైర్‌ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా కోసం సరిపడా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్లకు ఆన్‌–ఆఫ్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

గ్రామ సమీపంలోని మాచన్‌పల్లి గ్రామంలో సబ్‌స్టేషన్‌ ఉండటంతో అక్కడ 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతోందని, అదే విధంగా రామచంద్రపురం గ్రామానికి కూడా నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ నర్సిములు ఏఈ నర్సిరెడ్డిని కోరారు.

గ్రామస్తులు తెలిపిన సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏఈ నర్సిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఎ. ఉసేనయ్య, నాయకులు కురువ ఆనంద్‌ బిన్నీ, బి. వీరన్న, రాఘవేందర్‌ గౌడ్‌, ఎన్‌. వెంకట్‌ రాములు, బి. రాములు, బి. శ్రీను, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌బాబు, లైన్‌మెన్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.