ఏసీబీ కస్టడీలో డీఎస్పీ భీమ్‌రెడ్డి..

  • రూ.200 కోట్ల అక్రమాస్తులపై విచారణ
  • బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, లాకర్లపై అధికారుల ఆరా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణను ముమ్మరం చేశారు. న్యాయస్థానం రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించడంతో గురువారం చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

విచారణలో భాగంగా భీమ్‌రెడ్డి కూడబెట్టినట్లు అనుమానిస్తున్న భారీ అక్రమాస్తులు, బినామీ వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డి సుమారు రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఆయన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బెంగళూరు విమానాశ్రయం సమీపంలోని విలువైన భూములతో పాటు జహీరాబాద్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో సుమారు 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. ఈ ఆస్తుల కొనుగోలుకు నిధులు ఎలా సమకూరాయనే అంశంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

భీమ్‌రెడ్డి వద్ద హోంగార్డుగా పనిచేస్తున్న లక్ష్మణ్‌ పేరుతో భారీగా బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించిన ఏసీబీ.. ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తోంది.

ఇప్పటికే భీమ్‌రెడ్డికి సంబంధించిన 10 బ్యాంకు ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. లాకర్లలో బంగారం, నగదు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు రోజుల ఏసీబీ విచారణలో మరిన్ని ఆస్తుల వివరాలు, అక్రమ సంపాదనలో భాగస్వాములైన వ్యక్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.