హోరెత్తిన డీఎస్సీ 2015 సంఘీభావ ర్యాలీ…
వైసీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం
కర్నూలు బ్యూరో, ఆగస్టు 8(ఆంధ్ర ప్రభ ) : మెగా డీఎస్సీ 2025 నియామకాలపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ కర్నూలు నగరంలో డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు, అభ్యర్థులు చేపట్టిన సంఘీభావ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా, బ్రహ్మాండమైన స్పందనతో సాగింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.
కార్యక్రమంలో భాగంగా రాయలసీమ సాంస్కృతిక ప్రతీక అయిన చారిత్రాత్మక కొండారెడ్డి బురుజుపైకి ఎక్కి అభ్యర్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సొంత ప్రతిభ, మెరిట్ ప్రాతిపదికన కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై వైసీపీ నేతలు లేనిపోని నిందలు వేస్తూ, అవమానించడం దారుణమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిసర ప్రాంతాలను హోరెత్తించారు.

కొండా రెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీగా సాగింది. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థుల నాయకులు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి, మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై వైసీపీ నాయకులు విషప్రచారం చేయడం అత్యంత విచారకరం. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో ఆటలాడవద్దు. ఇకనైనా ఈ తప్పుడు ప్రచారాలు ఆపకపోతే రాబోయే రోజుల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతాం” అని హెచ్చరించారు.పారదర్శకంగా జరిగిన నియామకాలకు మద్దతుగా, భవిష్యత్తులో కూడా తమ హక్కులు, గౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉపాధ్యాయ లోకం స్పష్టం చేసింది.
