రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్

పెద్దపల్లి రూరల్ (ఆంధ్రప్రభ): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్డు పన్ను (ట్యాక్స్) సంబంధిత పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడకూడదని తెలిపారు. అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలని, ముందున్న వాహనాలను నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయకుండా రహదారికి ఎడమవైపున ప్రయాణించాలని సూచించారు.

జీబ్రా క్రాసింగ్‌లు, పాఠశాలల సమీప ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జే. రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.